Saturday, November 27, 2010

గ్రీటింగ్‌×పరామర్శ

గ్రీటింగ్‌, పరామర్శ ఈ రెంటిలో ఏది ముందు? రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల ముందున్న పజిల్‌ ఇది. గ్రూపు తగాదాల్లో తలమునకలైన కాంగ్రెస్‌ వారికి హఠాత్తుగా ఈ ధర్మసందేహం ఎందుకొచ్చిందంటారా? మొన్న కొన్ని గంటలపాటు నూతన ముఖ్యమంత్రి ఎవరవుతారోనని బీపీలు పెంచుకున్న పార్టీ నేతలకు ఆ కాస్తా తెలిశాక మంత్రి పదవులపై తెగ ఆందోళన పడుతున్నారు. నూట పాతికేళ్ల కాంగ్రెస్‌లో ఎలాగూ ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువ కనుక మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల పైరవీలు, లాబీయింగ్‌ సరేసరి. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజున అధికారులతో కిరణ్‌కుమార్‌రెడ్డి లాబీయింగ్‌ కాదు సమర్ధతే గీటురాయి అని చెప్పుకొచ్చారు. ఆ సమావేశానికి హాజరైన అధికారులు వాళ్లలో వారు ఢిల్లీలో లాబీయింగ్‌ చేయడంవల్లనే ఈయనగారు సిఎం అయ్యారట కదా అని గుసగుసలాడుకున్నారట. కుర్చీ ఎక్కిన తర్వాత ముచ్చటగా మూడో రోజున కిరణ్‌ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నట్లు? అని గొణుకున్నారు.

పదవులు ఎవరికి దక్కుతాయో తెలీక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఢిల్లీ వీధుల్లో, హైదరాబాద్‌ లేక్‌వ్యూలో మార్చ్‌ చేస్తూ జుట్టు పీక్కుంటుండగా రామాయణంలో పిడకల వేటలా గ్రీటింగ్‌ ముందా? పలకరింపు ముందా? అన్న ప్రశ్న ఎదురైంది. ఎన్ని డిక్ష్నరీలు వెతికినా ఆ మాటలకు అర్థం, తాత్పర్యం, నానార్ధం వంటపట్టట్లేదట. వైఎస్‌ బతికుండగా చీఫ్‌విప్‌గా, స్పీకర్‌గా ఆయనకు చేదోడువాదోడుగా ఉండి శిష్యుడిగా, నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రిని అభినందించగా స్వంతపార్టీకి చెందిన ఎంపి, అందులోనూ వైఎస్‌ తనయుడు జగన్‌ ఎందుకు కిరణ్‌కు శుభాకాంక్షలు చెప్పలేదు? జగన్‌కు కనీస మర్యాద తెలీదనుకోవాలా లేక యుద్ధం కొనసాగుతుందని పరోక్షంగా శంఖం పూరించారా? అని కాంగ్రెస్‌ నేతలు చర్చించుకుంటున్నారు.

జగన్‌ గ్రూపు తక్కువ తిందా? రాజకీయంగా కిరణ్‌ను వైఎస్‌ పైకి తీసుకొచ్చారు కదా, చీఫ్‌విప్‌, స్పీకర్‌ను చేసినందువల్లనే కిరణ్‌కుమార్‌ సిఎం అయ్యారు కదా అని వాదిస్తున్నారు. రాజకీయ గురువు ఆకస్మికంగా చనిపోవడంతో దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ముఖ్యంగా గురువు గారి భార్య విజయమ్మను ఎందుకు పరామర్శించలేదు? ఇది ముఖ్యమంత్రికి మర్యాదేనా? అధిష్టానం కోప్పడుతుందనే వైఎస్‌ సతీమణిని సిఎం పలకరించలేదని జగన్‌ గ్రూపు అస్త్రాలు సంధించింది. రోశయ్యను కలవడానికి తీరిక చేసుకున్న సిఎం విజయమ్మ దగ్గరకు వెళ్లలేకపోయారా అని ప్రశ్నిస్తున్నారు. 'రాహుల్‌ను పిఎం చేయాలన్న వైఎస్‌ చివరి కోరిక నెరవేరాలంటే ముందు ఆయన మొదటి, మధ్య కోర్కెలు నెరవేర్చాల్సి ఉంటుంది' పంచ్‌ ఇచ్చారు. గ్రీటింగ్స్‌ ముందని కిరణ్‌ అనుకూలురు కాదు పరామర్శ ముందని జగన్‌ మద్దతుదార్లు వాదించుకుంటున్నారు.

No comments:

Post a Comment