Thursday, November 25, 2010

కిరణ్‌ మిలీనియం జోక్‌

మూడు కుంభకోణాలు, ఆరు అక్రమాలతో వర్ధిల్లుతున్న యుపిఎ ప్రభుత్వం 2జి స్పెక్ట్రం స్కాంతో ఎటూ పాల్పోక ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. '2జి'పై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి) విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో ఈ ఉత్పాతం నుండి ఎలా బయటపడాలో ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వెలువడిన బీహార్‌ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను మరింత కుంగదీశాయి. బీహార్‌లో సోనియా,రాహుల్‌ ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్‌కు ఐదారు సీట్లే వచ్చాయి. సోనియా, రాహుల్‌ లోక్‌సభ స్థానాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి అంతంతమాత్రం. రోజురోజుకూ కాంగ్రెస్‌ అడుగు జారుతుండగా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ స్థానాలకు 41 గెలుచుకుంటామంటున్నారు కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఎందుకనో ఒక్క సీటు వదిలిపెట్టారు. అంతేకాదు 41 ఎంపీలను గెలిపించి రాహుల్‌ను ప్రధానిని చేస్తారట. ఈ కోరిక తనది కాదట. వైఎస్‌ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు 41 లోక్‌సభ సీట్లు సాధించి రాహుల్‌ను ప్రధానిని చేస్తామన్నారట. వైఎస్‌ ఆఖరి ఆశను కిరణ్‌కుమార్‌ నెరవేరుస్తారట.


ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఠాపోరు పతాకస్థాయికి చేరింది. వైఎస్‌ మరణం తర్వాత రోశయ్య సిఎంగా ఉన్న 14 నెలల 22 రోజుల్లో మంత్రులు పెద్దగా సహకరించింది లేదు. సంక్షేమ పథకాలకు కోత పెట్టారు. ప్రాంతీయ ఆందోళనల్లో ఏ ప్రాంతంలో ఆ పాట పడిన కాంగ్రెస్‌ రెండు ప్రాంతాల్లోనూ ముద్దాయుగా బోనులో నిలిచింది. ఉద్యోగులు, 104 సిబ్బంది సహా పలు వర్గాల ఆందోళనలు మిన్నంటాయి. 73,74 రాజ్యాంగ సవరణ రాజీవ్‌గాంధీ పుణ్యమని మురిసిపోయే కాంగ్రెస్‌ ప్రభుత్వమే మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేసింది. సహకార ఎన్నికలూ వాయిదా పడ్డాయి. పంచాయతీ ఎన్నికలు సైతం షెడ్యూలు ప్రకారం జరుగుతాయన్న గ్యారంటీ లేదు. ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత వల్లనే ఎన్నికలు వాయిదా పడ్డాయి.

రోశయ్య రాజీనామా తర్వాత కొత్త ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేయడంపై వైఎస్‌ జగన్‌ గ్రూపు గుర్రుగా ఉంది. జగన్‌ లక్ష్యంతోనే కిరణ్‌ను రంగంలోకి దించారంటున్నారు. జగన్‌కు బహిరంగంగా మద్దతిచ్చిన పాత మంత్రులను తొలగించి అధిష్టానం చెప్పినట్లు వినే వారితో కొత్త కేబినెట్‌ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని వార్తలొస్తున్నాయి. వైఎస్‌ కేబినెట్‌ను సమూలంగా మార్పులు చేస్తే సహజంగానే జగన్‌ గ్రూపు నుండి వ్యతిరేకత వస్తుంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని రోజులు సిఎంగా ఉంటారో తెలీదు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక, అనంతర పరిణామాలు ఉండనే ఉన్నాయి. సంక్షేమ పథకాలను కొనసాగిస్తామంటున్నప్పటికీ రోశయ్య వలే లీకులు అరికడతామంటున్నారు కిరణ్‌. ఆ పల్లవి ఎత్తుకున్నాకనే సంక్షేమానికి రోశయ్య కత్తెర పెట్టారు. పథకాలను మెరుగుపెట్టడానికి సమీక్షలు చేస్తే కుదరదు. తగినన్ని నిధులివ్వాలి. ప్రపంచబ్యాంక్‌ ఒప్పుకోదు కనుక ఆ పని చేసే అవకాశం లేదు. కనుక ప్రజలు ఆగ్రహం చెందడం అనివార్యం. ఈ పరిస్థితుల్లో 41 సీట్లు సాధిస్తామని న్యూ సిఎం చెప్పడం మిలీనియం జోక్‌ కాక మరేంటి?

3 comments:

  1. నేను త్వరలో కొత్త పార్టీ పెడుతున్నా
    ఆ ఒక్క MP సీటు నాదే

    ReplyDelete
  2. asalu marh-2011,congress centerlo untekadaa kiran joku pelaedi?

    ReplyDelete
  3. మీరు చెప్పినట్లు 41 ఎంపేసీట్లు వస్తాయో లేదో కానిమూడేళ్ళూ ఉంటారో లేదో చూడాలి.

    ReplyDelete