- వడ్డీ 18-30 శాతం
- ఇందిరమ్మ లబ్ధిదారులకు వల
- ఆగిన ఇళ్లకు ప్రత్యేక లోన్లు
గృహోపకరణాలు, చిన్న వ్యాపారాలు, రోజువారీ ఖర్చులకు రుణాలిచ్చి మహిళలను పీల్చి పిప్పిచేస్తున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై పంజా విసరడానికి సిద్ధమ య్యాయి. ప్రత్యేకంగా గృహ నిర్మాణాలకు సూక్ష్మ రుణాలివ్వడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. 'సూక్ష్మ గృహ రుణం' రంగంలోకి మైక్రోలు అడుగు పెట్టడానికి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించాయి. శాచురేషన్ ప్రాతిపదికన గ్రామాలు, పట్టణాల్లోని పేదలందరికీ పక్కా ఇళ్లంటూ ప్రభుత్వం నాలుగైదేళ్లుగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం ఆచరణలో ఘోరంగా విఫలమైంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉన్న గుడిసెలను కూల్చి పక్కాఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన లబ్ధిదారులకు నిధులివ్వ కుండా ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. ఇచ్చిన నిధుల్లో సైతం భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయి. లక్షల్లో చేపట్టిన ఇళ్లు మధ్య లోనే నిలిచిపోయాయి. నిధుల కోసం ఎదురు చూస్తున్న ఇందిరమ్మ లబ్ధిదారుల అవసరాలను మైక్రో సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. సూక్ష్మ సంస్థల ఆగడాలను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఇందిరమ్మ లబ్ధిదారులూ ఉన్నారు.
అయితే ఇప్పటి వరకూ ఇళ్ల నిర్మాణాలకంటూ ప్రత్యేకంగా మైక్రోలు అప్పులివ్వలేదు. ఇక నుంచి తమ ప్లాన్‌లో ఈ రంగానికి విరివిగా రుణాలివ్వాలని నిర్ణయించాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రూపులకు సూక్ష్మ రుణాలివ్వడానికి ముందుకొస్తున్నాయి. మామూలు గృహ రుణాలపై బ్యాంకులు 8-10 శాతం వడ్డీని వసూలు చేస్తుంటే మైక్రోలు 18 నుంచి 30 శాతం మధ్య వడ్డీ వసూలు చేస్తాయి. ఇప్పటికే బేసిక్స్ గ్రూపు సూక్ష్మ గృహ రుణాలు ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. గృహ రుణాలపై 18-24 శాతం వడ్డీని వసూలు చేస్తానంది. రాష్ట్రంలో పాతుకుపోయిన ఎస్‌కెఎస్, స్పందన, షేర్, అస్మిత, తదితర పెద్ద మైక్రోలు సైతం సూక్ష్మ గృహ రుణాల వైపునకు పరుగులు పెడుతున్నాయి.
సర్కార్ నిర్లక్ష్యం
స్వయం సహాయ బృందా (ఎస్‌హెచ్‌జి)ల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే వారికి బ్యాంకుల నుంచి బ్రిడ్జి రుణం ఇప్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో చేపట్టే ఇందిరమ్మ ఇళ్లకు సైతం బ్యాంక్ రుణంతో పాటు వడ్డీ సబ్సిడీ స్కీం కింద లక్ష రూపాయల వరకూ రుణం ఇప్పిస్తామని ప్రకటించింది. కాని లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలందలేదు. ప్రభుత్వ ఈ వైఫల్యం మైక్రోలకు బాగా కలిసొచ్చింది. ఈపరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని, ప్రత్యేకంగా మహిళలకు సూక్ష్మ గృహ రుణాలివ్వాలని మైక్రోలు ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగైదేళ్ల నుంచి ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ పథకంలో 81 లక్షల ఇళ్లకు మంజూరివ్వగా ఇప్పటికీ ఆన్‌లైన్‌లో 64 లక్షల మంది మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నమోదైన వాటిలో 30 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. పూర్తయ్యాయంటున్న వాటిలో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో మచ్చుకు చేస్తున్న విజిలెన్స్ తనిఖీలే చెబుతున్నాయి. ఇక మంజూరైన ఇళ్లలో 15 లక్షల నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా 19 లక్షల ఇళ్లను ప్రారంభించాల్సి ఉంది. ఇందిరమ్మను ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్‌లో సరిపడినన్ని నిధులివ్వట్లేదు. మొదట్లో సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌లో ప్రతిపాదించిన సర్కార్ రెండేళ్ల నుంచి రూ.1,800 కోట్లకే పరిమితం చేసింది. ఒక అంచనా ప్రకారం మంజూరైన ఇళ్లన్నీ పూర్తి కావాలంటే 12 వేల కోట్లు కావాలి. అరకొరగా ప్రభుత్వం నిధులిస్తే వచ్చే నాలుగేళ్లకు కాని ఇళ్లన్నీ పూర్తయ్యే పరిస్థితి లేదు.
బ్యాంకుల నిరాదరణ
ప్రభుత్వం ప్రకటించిన పథకంలోనే బ్యాంకులతో లింక్ పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి యూనిట్ విలువ రూ.54,250. దీనిలో బ్రిడ్జి రుణం రూ.20 వేలు. బ్రిడ్జి రుణాన్ని బ్యాంకులివ్వాలి. ఎస్‌హెచ్‌జిలో సభ్యులుగా ఉన్న మహిళలకు గ్రూపు గ్యారంటీపై బ్యాంకులు రుణాలివ్వాలి. పట్టణ ప్రాంతాల్లో యూనిట్ విలువ రూ.73 వేలు కాగా అందులో బ్యాంకు రుణం రూ.30 వేలు. మొదట్లో అరకొరగా బ్యాంకులు బ్రిడ్జి లోన్లిచ్చాయి. రెండేళ్ల నుంచి బ్యాంకులు ఆ పదాన్ని మర్చిపోయాయి. ప్రభుత్వం సైతం పట్టించుకోలేదు. లబ్ధిదారుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వమే రుణమివ్వాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు రూ.20 వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.30 వేలు రుణం ఇస్తానంది. వీటి పంపిణీ నత్తనడకన సాగుతున్నట్లు అధికారులే చెబుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొనే పేదలకు వడ్డీ సబ్సిడీ స్కీం వుంది. బ్యాంకులు విధించే వడ్డీలో ఐదు శాతం సబ్సిడీ ఇస్తారు. లబ్ధిదారులకు లక్ష రూపాయల వరకూ బ్యాంకులు రుణం ఇవ్వాల్సి ఉంది. బ్యాంకులు ఈ స్కీంపై దృష్టి పెట్టలేదు. ఇటీవల సిఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వడ్డీ సబ్సిడీ స్కీంకు మార్గదర్శకాలు తయారు చేయాలని నిర్ణయించారు. అయినా బ్యాంకులు అప్పులివ్వడానికి ముందుకు రావట్లేదు.ఈ పరిస్థితులను మైక్రో సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.
No comments:
Post a Comment