Monday, January 10, 2011

మీడియా అన్నింటికీ అతీతమా?

మీడియా అన్నింటికీ అతీతమా? ఎటువంటి చట్టాలూ దానికి అమలు కాకూడదా? స్వతంత్రంగా వదిలేయాలా? ఎప్పటి నుండో మీడియా పాత్రపై విస్తృతంగా ఈ చర్చ జరుగుతోంది. ముంబయిపై ఉగ్రవాది దాడి తర్వాత మీడియా పాత్ర వివాదాస్పదమైంది. స్వీయ నియంత్రణను నొక్కి చెబుతున్నప్పటికీ దాని అమలు ఎప్పటికప్పుడు ప్రశ్నార్ధకమవుతోంది. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్శిటీలో ఆందోళనల కవరేజిపై, చానళ్ల ప్రసారాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటున్నారు తెలంగాణాలోని కొన్ని పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, ఓయు విద్యార్థులు. ఎమర్జెన్సీని తలపిస్తోందని మండి పడుతున్నారు. మీడియాపై ఆక్షలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టంటున్నాయి చాలా చానళ్లు. ఆంక్షలు తొలగించాలని నేతలు, చానళ్ల సిఇఓలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం, పోలీసులు మాత్రం మీడియాపై ఆంక్షల్లేవంటున్నారు. టీవీ ప్రసారాలపై నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్లు (ఎన్‌బిసి) రూపొందించుకున్న మార్గదర్శకాలను అమలు చేయాలంటున్నామని డిజిపి అరవిందరావు, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఎకె ఖాన్‌ చెబుతున్నారు. హౌం మంత్రి సబితారెడ్డి సైతం ఆంక్షల్లేవన్నారు.

ప్రత్యక్ష ప్రసారాల్లేవుకాని కొన్ని చానళ్లలో విజివల్స్‌ చూపుతూనే ఉన్నారు. పత్రికల్లో ఫోటోలు ప్రచురితమవుతున్నాయి. ఆంక్షలుంటే ఇవి ఎలా సాధ్యం? ఎన్‌బిసి మార్గదర్శకాలు రూపొందించగా వాటిని అమలు చేయాల్సిన చానళ్లు ఎపికి ప్రత్యేకంగా బ్రాడ్‌ కాస్టర్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకొని ఆంక్షలు ఎత్తేయాలని గోల చేస్తున్నాయి.

మీడియాకు స్వేచ్ఛ ఉండకూడదని ఎవరూ అనరు. స్వేచ్ఛ అంటే ఎలాంటి స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి నాలుగో స్తంభంగా పని చేయాల్సిన మీడియా తన బాధ్యతను మర్చి ప్రవర్తించవచ్చా? ఆత్మహత్యలను నివారించాల్సిన మీడియా వాటినే పదే పదే చూపి ప్రేరేపించడం సబబేనా? ఉద్రిక్త, భావోద్వేగ ఘటనలు, విచ్ఛిన్న సంఘటనలు, విధ్వంసాలు, దాడులు ఏ ప్రాంతంలో జరిగినా సరే.. అది ఓయు కావొచ్చు ఎయు కావొచ్చు కెయు కావొచ్చు ఎస్‌కెయు కావొచ్చు విజయవాడ కావొచ్చు, హైదరాబాద్‌ కావొచ్చు... ఎక్కడ జరిగినా అటువంటి ప్రసారాలను అతిగా చూపడం సరికాదు.

రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, పేదలు ప్రభుత్వాల వైఫల్యాలలతో అల్లాడుతున్నారు. అధిక ధరలతో సతమతమవుతున్నారు. వీటిని ఫోకస్‌ చేస్తే ప్రజలకు నిజాలు తెలుస్తాయి. మసాజ్‌ సెంటర్లలో అశ్లీల దృశ్యాలు, భార్యాభర్తల మధ్య తగాదాలపై ఫ్యానల్‌ డిస్‌కషన్లు, అర్థరాత్రి మిర్చి మసాలాలు, నేరాలను ప్రోత్సహించే క్రైమ్‌ వార్తలు, పిల్లల చేత జగుప్సాకర నృత్యాలు, సెక్స్‌, హింస ఒకటేమిటి... టిఆర్‌పి రేటింగ్‌ కోసం ఏ గడ్డి కరవడానికైనా వెనుకాడని సోకాల్డ్‌ చానళ్ల, సోకాల్డ్‌ ప్రోగ్రాములకు, వికృత చేష్టలకు స్వేచ్ఛ ఉండాలనుకోవడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని తెలుసుకోవాలి. బాధ్యతనెరిగి మీడియా ప్రవర్తించాలి.

ఇప్పటికే నీరా రాడియా, బర్ఖదత్‌ వంటి వారి చేష్టలతో మీడియా పరువు పోయింది. మన రాష్ట్రంలో కొన్ని చానళ్ల పోకడ వల్ల అసహ్యం కలుగుతోంది. ప్రజల్లో భయాన్ని కలిగించడం, అసాంఘిక కార్యకలాపాలను, వైషమ్యాలను, భాగోద్వేగాలను రెచ్చగొట్టడమే స్వేచ్ఛ అనుకుంటే అంతకంటే వంచన మరోకటి ఉండదని చానళ్లు గుర్తిస్తే మంచింది. లేకపోతే త్వరలోనే ప్రజల ఆగ్రహం పెల్లుబకడం ఖాయమని మర్చిపోకండి. టిఆర్‌పి రేటింగ్‌ కోసం పాకులాడకుండా సమాజాభివృద్ధి కోసం, ఐక్యత, సమగ్రత కోసం, సొసైటీలోని కుళ్లును కడిగి పారేయడానికి కృషి చేయాలని విజ్ఞప్తి. సొంత లాభాలు, ఎజెండా కోసం తాపత్రయం పడటం మీడియా విడనాడాలి. మీడియా స్వేచ్ఛ అంటే కేవలం యాజమాన్యాలకే స్వేచ్ఛ కాదు. వాటిలో పని చేసే సిబ్బందికీ స్వేచ్ఛ కల్పించాలన్న విషయాన్ని, వారి బాగోగులు చూడాలన్న తమ బాధ్యతను మర్చిపోవద్దని మనవి.

3 comments:

  1. మీడియా స్వేచ్ఛ అంటే కేవలం యాజమాన్యాలకే స్వేచ్ఛ కాదు. వాటిలో పని చేసే సిబ్బందికీ స్వేచ్ఛ కల్పించాలన్న విషయాన్ని, వారి బాగోగులు చూడాలన్న తమ బాధ్యతను మర్చిపోవద్దని మనవి.-nicely concluded...

    ReplyDelete
  2. అధికశాతం ప్రజల మనసుల్లో మీడియా పట్ల ఉన్న అభిప్రాయాన్ని చాలా చక్కగా వ్రాశారు. kudos to you for this nice article. మీడియా చేస్తున్న అతి అంతా ఇంతా కాదు.

    ReplyDelete
  3. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్పులే మన మీడియా లో వస్తూన్నాయి అనుకుంటా??

    ReplyDelete