Monday, January 31, 2011

శంకర్రావు గడబిడ

చేనేత, జౌళి శాఖా మంత్రి శంకర్రావుకు నిజంగానే బెదిరింపు కాల్స్‌ వచ్చాయా? ఆ ఫోన్లకు మంత్రి భయపడ్డారా? మంత్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదా?... వైఎస్‌ సిఎంగా ఉండగా శంకర్రావు తెరమరుగయ్యారనే చెప్పాలి. మంత్రి పదవి రాలేదని ఒకటి రెండుసార్లు అసంతృప్తి వ్యక్తం చేయడానికే పరిమితమయ్యారు. పెద్దగా అసెంబ్లీకి వచ్చింది కూడా లేదు. అప్పట్లో కాకా కుమారుడు వినోద్‌ కేబినెట్‌లో ఉన్నందున కాకా అల్లుడైన శంకర్రావును తీసుకోలేదని వార్తలొచ్చాయి. వైఎస్‌ చనిపోయాక సిఎల్పీని వేదికగా చేసుకొని వైఎస్‌, ఆయన కుటుంబంపై విమర్శలు చేసిన ఆయనకు గత డిసెంబర్‌లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో బెర్తు దక్కింది. మంత్రి అయ్యాక కూడా సిఎల్పీలోనే ఆయన ఎక్కువగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారు.

ఇక జగన్‌ ఆస్తులపై విచారణ జరిపించాలని శంకర్రావు రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. విచారణకు స్వీకరించి జగన్‌ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. తొలి రోజు తానసలు లేఖ రాయలేదన్నారు ఆ మరుసటి రోజు ఎమ్మెల్యేగా లేఖ రాశాను, మంత్రి హౌదాలో కాదు అని మాట మార్చారు. కేబినెట్‌లో జగన్‌ అక్రమాలపై చర్చించి సిబిఐతో విచారణ జరిపించవచ్చు. కానీ హైకోర్టుకు ఎందుకు లేఖ రాశారని అడిగితే డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు.

ఇప్పుడు తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఎత్తుకున్నారు శంకర్రావు. కాల్స్‌ వస్తున్నాయని ఫిర్యాదు చేసినా సిఎం, హౌం మంత్రి, డిజిపి పట్టించుకోలేదని, అసమర్ధపు ప్రభుత్వం, అసమర్ధపు మంత్రివర్గం అని తిడుతున్నారు. డిసిపి స్థాయి అధికారి శంకర్రావు ఇంటికి వెళితే సమాచారం ఇవ్వలేదంటున్నారు డిజిపి అరవిందరావు. ఫోన్‌లో తిడితే నువ్వూ తిట్టాలి, తొడ కొడితే నువ్వూ కొట్టాలి అని సహచర మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి శంకర్రావుకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరో మంత్రి శత్రుచర్ల అయితే బెదిరింపు కాల్స్‌ వచ్చినా పైకి గంభీరంగా నటించాలని శంకర్రావుకు సలహా పడేశారు.

ఇంతకీ శంకర్రావుకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయా? వస్తే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? పోలీస్‌ అధికారులకు శంకర్రావు ఎందుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు? నిజంగా మంత్రికి బెదిరింపు కాల్స్‌ వస్తే అది ప్రభుత్వానికే అవమానం. ఫిర్యాదు చేసినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదంటే శంకర్రావు అసమర్ధ మంత్రి అయినా అయి ఉండాలి. తెలంగాణాకు చెందిన హౌం మంత్రి తెలంగాణాకే చెందిన మరో శంకర్రావు మొత్తుకుంటుంటే చోద్యం చూడటమేంటి?

No comments:

Post a Comment