Thursday, January 27, 2011

కిరణ్‌×జగన్‌... పేలుతున్న మాటల తూటాలు

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, వైఎస్‌ జగన్మోహన రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం తర్వాత పరిస్థితిలో కొంత మార్పొచ్చింది. కోర్‌ కమిటీకి ముందు వరకూ జగన్‌, ఆయన శిబిరంపై సిఎం నేరుగా వ్యాఖ్యలు చేయలేదు. డిఎల్‌ రవీంద్రారెడ్డి, శంకర్రావు, తులసిరెడ్డి వంటి నేతలు మాత్రమే కౌంటర్లు ఇస్తూ వచ్చారు. ఢిల్లీలో జగన్‌ జలదీక్ష అనంతరం జరిగిన కోర్‌ కమిటీ భేటీ ముగిసిన వెంటనే కిరణ్‌ వాగ్బాణాలు సంధించారు. ఎవరి దయాదాక్షిణ్యాల పైనా తమ ప్రభుత్వం నడవడం లేదని, ఆ మాటకొస్తే వైఎస్‌ను రెండుసార్లు సిఎంగా చేసిన కాంగ్రెస్‌కు ఆయన కుటుంబం రుణ పడి ఉండాలని అన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా సర్కార్‌కేమీ కాదని స్పష్టం చేశారు.

రచ్చబండ తొలిరోజున మరో అడుగు ముందుకేసి పరిటాల రవి హత్య కేసులో జగన్‌ను తానే తప్పించానని, అసెంబ్లీలో చర్చ చేశానని పేర్కొన్నారు. వైఎస్‌కు సోనియావద్ద తానే అప్పాయింట్‌మెంట్‌ ఇప్పించానని కూడా చెప్పారు. సిఎం చేసిన వ్యాఖ్యలతో జగన్‌ శిబిరం తమ విమర్శల పదును పెంచింది. అంబటి రాంబాబు తదితరులు సిఎంవి పిచ్చి ముదిరిన మాటలని మండి పడ్డారు. బుధవారం జగన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల విమర్శలు మరింత వాడి పెంచారు. తాము వైఎస్‌ బొమ్మ పెట్టుకొని గెలిచామని, అందరూ అలాగే గెలిచారని, వైఎస్‌ బొమ్మ పెట్టుకోలేదు అని అనుకున్నవారు రాజీనామా చేసి సోనియా బొమ్మ పెట్టుకొని గెలవాలని సవాల్‌ చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని తాము అనుకోవడం లేదని, రెచ్చగొడితే పడినా పడొచ్చని మాజీ మంత్రి బాలినేని హెచ్చరించారు. దమ్ముంటే ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం పెట్టుకుంటే సర్కార్‌ ఉంటుందో ఊడుతుందో తెలిసిపోతుందని సవాల్‌ విసిరారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తాము ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని, అయితే ప్రజా సమస్యల పరిష్కారానికే దాన్ని వినియోగిస్తామని అంటున్నారు.

ప్రభుత్వం విశ్వాస తీర్మానం పెట్టదు, జగన్‌ పక్కకెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయదు. జగన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేయరు, అవిశ్వాస తీర్మానం పెట్టరు. టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా లేదు. మూడు శిబిరాలూ వారుగా ఏమీ చేయరు.కానీ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. రాజకీయంగా వేడి పుట్టిస్తారు. ఈ రాజకీయ ప్రహసనానికి ఎన్ని రోజుల్లో తెర పడుతుందో కాలమే నిర్ణయించాలి. ప్రత్యేక తెలంగాణ అంశం ఉండనే ఉంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నాటికైనా రాజకీయ సంక్షోభం పోయి తమకు మేలు చేకూర్చే కార్యక్రమాలు ఎప్పుడు ఊపందుకుంటాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment