Sunday, January 23, 2011

ఎవరికి ఎవరు రుణ పడాలి?

ఎవరికి ఎవరు రుణ పడాలి? కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ కుటుంబం రుణ పడాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అంటుండగా.. కాదు రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్‌కే కాంగ్రెస్‌ రుణ పడాలంటున్నారు జగన్‌, ఆయన మద్దతుదార్లు. వీరి వాదనలను పరిష్కరించేదెవరు? రెండు పక్షాల వాదనలూ సబబుగానే కనబడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పతనమైనప్పుడు కాంగ్రెస్‌కు జవసత్వాలు నింపిన వారు వైఎస్‌. 1994లో ఎన్టీఆర్‌ రెండోసారి సృష్టించిన ప్రభంజనానికి కాంగ్రెస్‌ 26 ఎమ్మెల్యే స్థానాలకు పడిపోయింది. కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హౌదా కూడా దక్కలేదు. ఆ దెబ్బతో పదేళ్లపాటు కాంగ్రెస్‌ కోలుకోలేదు. 


2004, 2009లో రెండుసార్లు వైఎస్‌ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చాయి. ఇవన్నీ నిజమే అయినా వైఎస్‌ చనిపోయాక, జగన్‌ కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ధిక్కరించి పార్టీని వీడాక వైఎస్‌ కుటుంబంపై కాంగ్రెస్‌ చర్చ చేస్తోంది. తన దయాదాక్షిణ్యాలపై ప్రభుత్వం నడుస్తోందని జగన్‌ అంటుంటే, సోనియా, పార్టీ దయాదాక్షిణ్యాలపైనే తన సర్కార్‌ నడుస్తోందంటున్నారు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. జగన్‌ వెంట దీక్షల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్‌ విసురుతున్నారు. జగన్‌ దీక్షకెళుతున్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌ వారేనంటున్న సిఎం ఆ ఎమ్మెల్యేలపై చర్యలదగ్గరకొచ్చేసరికి తటపటాయిస్తున్నారు. 'కోడి పక్కింటోడిదైనా మన పెరట్లో గుడ్డు పెడితే అది మనదే' అన్నట్లుంది సిఎం వ్యవహారం. జగన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు తమ వారేనంటున్నారు. బయటికి వెళ్లదలుచుకుంటే పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలంటున్నారు. అంత ధైర్యం సిఎంకు ఎలా వచ్చింది? నిజంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తిరిగి గెలిచినా గెలవకపోయినా కిరణ్‌కుమార్‌ సర్కార్‌ కుప్పకూలిపోతుంది. అయినా రాజీనామా చేయమంటున్నారంటే మరెవరితోనో ముందస్తు ఒప్పందాలు జరిగి ఉండాలి. ఎమ్మెల్యేలు ఒక కాలు కిరణ్‌ వద్ద, మరో కాలు జగన్‌ వద్ద పెట్టి పంగజాపారు. రాజీనామాలు వారంతట వారు చేయరు. కాంగ్రెస్‌ తనకు తాను ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోదు. గవర్నమెంట్‌ను పడదోయనంత వరకూ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోదు కాంగ్రెస్‌. చర్య తీసుకోనంత వరకూ రాజీనామాలు చేయరు ఎమ్మెల్యేలు. ఈ చదరంగం ఎత్తులు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం నలిగి పోతున్నారు. ప్రజలు ఓట్లు వేస్తేనే ఎవరైనా గెలిచేది. వైఎస్‌ కుటుంబం కాంగ్రెస్‌కు రుణ పడాలా లేక కాంగ్రెస్సే వైఎస్‌ కుటుంబానికి రుణ పడాలా? అన్న ప్రశ్నలు సంధించే వారు ప్రజలను మర్చిపోయారు. ఎవరైనా తమకు ఓట్లు వేసిన ప్రజలకు రుణ పడాలన్న సంగతి మర్చిపోయి వాదులాడుకోవడం ప్రజలను వంచించడమే కాగలదు.

No comments:

Post a Comment