Friday, January 21, 2011

టాలీవుడ్‌ హీరోలే మాఫియాకు బాధ్యులు

టిడిపి నాయకుడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెర్వు సూరి... కరడుగట్టిన ఫ్యాక్షన్‌ లీడర్‌ అయిన ఆ సూరి హైదరాబాద్‌ నడిబొడ్డున తన అనుచరుడు భాను కిరణ్‌ చేతిలో హత్యకు గురయ్యాడు. సూరి హత్య కేసు తెలుగు సినీ పరిశ్రమకు తగులుకుంది. సూరి, భాను చేసిన సెటిలిమెంట్లు, వాటికీ సినిమా ప్రముఖులకు మధ్య నెలకొన్న సంబంధాలు పుట్ట నుండి పాముల్లా ఒక్కటొక్కటి బయటికొస్తున్నాయి. ఏళ్ల తరబడి ఫ్యాక్షనిస్టుల దందాలు రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వేళ్లూనుకున్నా, టాలీవుడ్‌లోని ప్రముఖులు దందా రాయుళ్లతో పెనవేసుకు పోయినా పోలీసులు, ఇంటెలిజెన్స్‌కు ఎందుకు సమాచారం రాలేదన్నది ప్రధాన ప్రశ్న.

నిఘా వ్యవస్థ వైఫల్యం చెందైనా ఉండాలి లేక ఉద్దేశ పూర్వకంగానే ఆ సెటిల్‌మెంట్లకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చి అయినా ఉండాలి. పోలీసులు నిస్సంకోచంగా చీకటి సెటిలిమెంట్లకు మద్దతిచ్చారంటే ప్రభుత్వ, రాజకీయ జోక్యం ఉండి ఉండే ఉంటుంది. ఇప్పటికే ఒక మంత్రి కుమారుడు భానుతో కలిసి రియల్‌ సెటిల్‌మెంట్లు చేశారంటూ ప్రచారం సాగుతోంది.

భానుతో లింకులున్నాయంటున్న టాలీవుడ్‌ నిర్మాతలు, ఫైనాన్షియర్లు చిన్నా చితకా వ్యక్తులు కాదు. ప్రముఖ హీరోలతో కోట్ల రూపాయలు పోసి సినిమాలు నిర్మించినవారే. సి.కళ్యాణ్‌ బాలకృష్ణతో పరమవీరచక్ర, మహేష్‌బాబుతో ఖలేజా తీశారు. పవన్‌కళ్యాణ్‌తో సినిమా తీసిన సింగనమల రమేష్‌ సైతం భానుతో లింకు పెట్టుకున్నారంటున్నారు. నటుడు గణేష్‌ పేరు కూడా వినిపిస్తోంది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్లు ఫ్యాక్షనిస్టు-మాఫియాతో కుమ్మక్కై వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అక్రమంగా సంపాదించారని పోలీసులే కూపీ లాగారు.

ముంబయిలో దావుద్‌ ఇబ్రహీం వంటి మాఫియా లీడర్లతో బాలీవుడ్‌ చెట్టపట్టాలేసుకు తిరుగుతోంది. ఆ ధోరణి టాలీవుడ్‌కూ పాకిందని సూరి, భాన్‌ దందాలు స్పష్టం చేస్తున్నాయి. టాలీవుడ్‌లోనూ 'దావూద్‌'లున్నారని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నిర్మాతలు కోట్ల రూపాయలతో సినిమాలు తీస్తూ సినిమా సినిమాకూ హీరోలు, హీరోయిన్ల పారితోషికాలు పెంచేస్తున్నారు. నిర్మాతలు ఇస్తున్నారు కదా అని హీరోలు, హీరోయిన్లు సైతం 'మాఫియా' నిర్మాతల సినిమాల్లో నటిస్తున్నారు. డబ్బులు ఎక్కడి నుండి తెస్తే మాకెందుకు మాకు రెమ్యునరేషన్‌ అందితే చాలు అనుకుంటున్నారు నటులు, నటీమణులు. సమాజం ఎటు పోతే మాకెందుకనుకుంటున్నారు. సినిమా బాగోకపోయినా వంద రోజులు ఆడించడం దగ్గర నుండి కొన్ని జిల్లాల హక్కుల వరకూ పొందుతున్న టాలీవుడ్‌ తారలే మాఫియా నిర్మాతల కార్యకలాపాలకు కారణం. కొందరు తారలైతే మాఫియా, ఫ్యాక్షనిస్టులతో అంట కాగుతున్నారు. డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలు ఇటీవలే భయట పడ్డాయి.

టాలీవుడ్‌లో సూరి, భాను లాంటి వాళ్లు చెలరేగడానికి టాలీవుడ్‌ మొత్తం బాధ్యత వహించాలి. నిర్మాతల నుండి అందినకాడికి పారితోషికాలు గుంజుతున్న హీరోలు, హీరోయిన్లు మాఫియాకు మద్దతిచ్చినట్లే లెక్క. నిర్మాతలిస్తున్నారు కనుక తీసుకుంటున్నామనే కుంటి సాకులు మానుకోవాలి. రియల్‌ దందాలు, మాఫియా, ఫ్యాక్షన్‌తో సంబంధం ఉన్న సినీ ప్రముఖుల సినిమాలను సమాజమే బహిష్కరించాలి.

No comments:

Post a Comment