Wednesday, January 26, 2011

నల్లధనంపై కాంగ్రెస్‌ దొంగాట ఎందుకు?

విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల ధనాన్ని తిరిగి దేశానికి రప్పించడానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది? కనీసం వివరాలనైనా ఎందుకు వెల్లడించట్లేదు? వివరాలు బహిర్గతం చేస్తే ప్రళయం, సునామీ వస్తుందన్న తీరున ఆందోళన చెందడానికి వెనుక కారణాలేమిటి? ఈ ప్రశ్నలు సగటు జీవుల మెదళ్లను తొలుస్తున్నాయి. దేశం వెలుపల మన వాళ్లు దాచిన నల్ల ధనాన్ని వెలికి తీస్తామని 2009 ఎన్నికల్లో బిజెపి నినాదం ఎత్తుకుంది. ఆ నినాదం ఎత్తుకుంది కాబట్టి బిజెపి స్వచ్ఛమైన పార్టీ అనుకుంటే పొరపాటే అవుతుంది. బ్లాక్‌ మనీని దాచే 'పెద్ద'లతో అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు సైతం బిజెపి చెట్టపట్టాలేసుకు తిరిగింది. కేవలం ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవడం కోసమే బిజెపి బ్లాక్‌ మనీ నినాదం ఎత్తుకుంది. బిజెపి ఆ హామీ ఇచ్చింది కనుక కాంగ్రెస్‌ తప్పని పరిస్థితుల్లో నల్లధనం అంశం ఎన్నికల్లో ప్రస్తావించింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నల్ల ధనాన్ని వెలికి తీసి దేశానికి రప్పిస్తామని ప్రజలకు వాగ్దానం చేసింది.

2009 మేలో కాంగ్రెస్‌ సారధ్యంలోని యుపిఎ-2 కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలోకొచ్చి 20 నెలలవుతోంది. అంటే అరొందల రోజులన్నమాట. అయినా వంద రోజులు కానట్లు నసుగుతోంది. ప్రతిపక్షాలు నల్లధనం గురించి అడిగితే ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నోరు మెదపట్లేదు. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ మాట్లాడుతూ నల్లధనం వివరాలు బహిర్గతం చేయడం కుదరదని తెగేసి చెప్పారు. అంబానీ, మిట్టల్‌, టాటా, బిర్లా వంటి శత కోటీశ్వరులకు యుపిఎ సర్కార్‌ తన విధానాలతో లాభం చేకూర్చింది. ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వం నుండి రాయితీలు పొందుతూ పన్నులు ఎగ్గొడుతూ ప్రజలను దోపిడీ చేస్తూ అక్రమ ఆస్తులను సంపాదిస్తున్న సోకాల్డ్‌ మద గజాలే విదేశాల్లో నల్లధనం దాస్తున్నాయి. వారికి వంతపాడే రాజకీయ నాయకులు సైతం స్విస్‌ బ్యాంకుల్లో డబ్బు కూడబెడుతున్నారు.

స్విస్‌ బ్యాంకుల్లో మన పెద్దలు 72 లక్షల కోట్ల రూపాయలు దాచినట్లు వార్తలొస్తున్నాయి. ప్రణబ్‌ మాత్రం 462 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. అంటే 20 లక్షల కోట్ల రూపాయలన్నమాట. 72 లక్షల కోట్లు నల్లధనం అంటే 72 పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో ఊహించలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌ లక్ష కోట్లకు అటూ ఇటూ ఉంటోంది. మన రాష్ట్రం లాంటి 72 రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌ ఎంత ఉంటుందో అంత నల్లధనాన్ని మన పెద్దలు విదేశాల్లో దాచారన్నమాట. అటువంటి సోకాల్డ్‌ పెద్దలకు నష్టం కలిగించకూడదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నల్లధనం వివరాలు వెల్లడిస్తే యుగాంతం వస్తుందన్నట్లు మాట్లాడుతోంది. నల్ల ధనాన్ని వెలికి తీస్తానని ప్రజలకు ఇచ్చిన హామీకి తూట్లు పొడిచి కుంటి సాకులు చెబుతోంది.

No comments:

Post a Comment