Sunday, January 16, 2011

సంక్రాంతిపై అర్థం లేని వాదనలు

సంక్రాంతి ఎవరి పండుగ? ఆంధ్రా వాళ్ల పండుగని ఏడాది నుండి ప్రచారం జరుగుతోంది. కెసిఆర్‌ నిరాహారదీక్ష, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలు ఊపందుకున్న తరుణంలో నిరుడు సంక్రాంతి ప్రస్తావన వచ్చింది. తెలంగాణ రాజకీయ జెఎసి, ఓయు విద్యార్థి జెఎసి అయితే లక్షలాదిగా సంక్రాంతి పండగ చేసుకోడానికి ఇక్కడి నుండి వెళ్లే ఆంధ్రా వాళ్లను తిరిగి తెలంగాణాలో, హైదరాబాద్‌లో అడుగు పెట్టనీయబోమని గత ఏడాది ఇదే రోజుల్లో హెచ్చరించారు. అంతేకాదు కొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా తాత్కాలిక గోడలు సైతం నిర్మించారు. ఈ చర్యలు ఆంధ్రా వాళ్ల మనోభావాలను కలిచివేశాయి. అప్పట్లో టిఆర్‌ఎస్‌ దాని అనుబంధ సంఘాలు సైతం సంక్రాంతి ఆంధ్రావాళ్ల పండుగన్నాయి. వచ్చే సంక్రాంతితో ఆంధ్రా వాళ్ల పీడ విరగడవుతుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తుందని టిఆర్‌ఎస్‌, జెఎసి నేతలు ఇప్పుడు ఆశాభావం వెలిబుచ్చారు. 


రెండు రోజుల నుండి తెలంగాణ జన జాగృతి నేత కెసిఆర్‌ కూతురు అయిన కవిత స్వరం మార్చారు. సంక్రాంతి ఆంధ్రావాళ్ల పండగని కొంత కాలంగా ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని పల్లవి అందుకున్నారు. తెలంగాణ సంస్కృతి తెలీనివాళ్లు సంక్రాంతి తెలంగాణ వాసులది కాదంటున్నారని మండి పడ్డారు. తెలంగాణాలోనూ సంక్రాంతి పండుగ చేసుకుంటారని తెలిపారు. సంక్రాంతి పండుగ చేసుకొని తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పాలని కవిత పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా సోమవారం తెలంగాణ జిల్లాల్లో రహదారుల దిగ్బంధనానికి, రాస్తారొకోలకు పిలుపునిచ్చింది తెలంగాణ జెఎసి. పండక్కి ఊర్లు వెళ్లి తిరిగొచ్చేవారిని అడ్డుకోవడమే జెఎసి లక్ష్యంగా కనబడుతోంది. అటువంటి ఉద్దేశం తమకు లేదని, తెలంగాణ రాష్ట్ర అంశం కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని జెఎసి ఛైర్మన్‌ కోదండరాం అంటున్నారు.

కవిత సంక్రాంతిని తెలంగాణాలోనూ జరుపుకుంటారంటుంటే, ఆంధ్రావాళ్లది సంక్రాంతి అంటున్నారు కొందరు నేతలు. సంక్రాంతి ఆంధ్రప్రదేశ్‌ మొత్తానికీ, ఆ మాటకొస్తే భారత దేశం మొత్తానికీ పండుగే. ఇది ప్రకృతికి సంబంధించిన పండుగ. ప్రకృతి పండుగంటే ప్రజలు, సమాజంతో ముడి పడి ఉంటుంది. సూర్యుడి గమనానికి సంబంధించింది. దక్షిణాయనం పోయి ఉత్తరాయణం సంక్రాంతితో ప్రారంభమవుతుంది. కొన్ని చోట్ల 'కీడు' పండగ అంటున్నారు. కీడెంచేది ఎప్పడూ పండుగ కాదు. కానీ సంక్రాంతిని 'కీడు'తో పోల్చినా పండుగే అంటున్నారు. అదీ సంక్రాంతికున్న ప్రత్యేకత. కుంటుంబంలో చనిపోయినవాళ్లను తలుచుకోవడమే 'కీడు' అని అంటారేమో? కానీ కొందరు నాయకులకు, ప్రముఖులకు ప్రభుత్వమే వర్ధంతిని 'పండుగ'గా జరుపుతోంది. అందుకే సంక్రాంతిలో కొందరికి కీడు కన్పించినా అది అందరికీ పండుగే. పండుగను ప్రాంతీయ విభేదాలతో ముడిపెట్టి దాని విస్తృతిని ప్రాశస్త్యాన్ని తగ్గించాలనుకోవడం అమాయత్వం తప్ప మరేం కాదు. అర్థం లేని వాదనలు అనవసరం.

4 comments:

  1. ప్రసాదు గారూ,
    భలే భలే బాగా చెప్పారు.



    వెంకట సుబ్బారావు కావూరి
    తెలుగిల్లు

    ReplyDelete
  2. చక్కగా చెప్పారు.టి ఆర్ ఎస్ వారి అర్ధం లేని ఆరోపణలు,బెదిరింపులే ప్రత్యేక తెలంగాణకు పెద్ద అవరోధం.ఆ ధోరణి వల్లే ఆంధ్ర ప్రజలు తమ వ్యతిరేకతను తీవ్ర స్థాయిలొ తెలియజేసారు.ఏదయినా ఇబ్బంది ఉంటే దానిని సామరస్య ధోరణిలొ పరిష్కరించుకోవాలి.తీవ్రవాద ధోరణివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు.

    ReplyDelete