Tuesday, January 25, 2011

ఎటిఎం..ఎనీ టైం మందు

పూణె పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరం. అక్కడి ప్రజలు పని ఒత్తిడి వల్ల బిజీగా గడుపుతుంటారట. కనీసం తమ కుటుంబం కోసం పాలు కొనుక్కొనే తిరిక కూడా చిక్కట్లేదట. అక్కడి పాల సహకార సంఘం ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది. గుజరాత్‌లో అక్కడక్కడ ఏర్పాటు చేసినట్లుగానే పూణెలోనూ ఎటిఎంలను ఏర్పాటు చేయాలనుకుంది. ఎటిఎం అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆటోమెటిక్‌ టెల్లర్‌ మిషన్‌. డబ్బు తీసుకుంటున్నారు కాబట్టి ఎనీ టైం మనీ అని కూడా అంటున్నారు సాధారణ ప్రజలు. పూణెలో ఏర్పాటు చేసేది ఎనీ టైం మిల్క్‌. క్రెడిట్‌కార్డు లేదా డెబిట్‌కార్డు వినియోగిస్తే లేదా కాఫీ మిషన్‌ టైపులో డబ్బులు వేస్తే పాలొస్తాయి. ఏ సమయంలోనైనా ఉద్యోగులు పాల కోసం ఎటిఎంను వాడుకోవచ్చు. త్వరలో పూణెలో ఈ ఎటిఎంలు రాబోతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఐడియా వచ్చిందట. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చెస్తుంది అన్నట్లు ఆ ఐడియాతో ఇప్పుడు మద్యంపై వచ్చే ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం తెచ్చుకోవచ్చని సర్కార్‌ ఉబలాట పడుతోందంటున్నారు. 


బెల్టు షాపులొచ్చాక ఏ గ్రామంలోనైనా రక్షిత మంచినీరు దొరక్కపోవచ్చుకానీ లిక్కర్‌ మాత్రం పొంగి ప్రవహిస్తోంది. బెల్టుషాపులకు బదులు ఎనీ టైం మందు అనబడే ఎటిఎం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వినికిడి. ఆదాయం కోసం ఏ గడ్డి కరవడానికైనా ప్రభుత్వం రెడీ కనుక త్వరలో ఇక్కడా 'ఎటిఎం'లు ఏర్పాటు కావొచ్చు. మందుబాబులు ఎం చక్కా క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో, వైన్‌షాపుకు, బెల్టు షాపుకు వెళ్లకుండానే దగ్గర్లోని ఎటిఎంను సందర్శించి ఎంజారు చేయొచ్చు మరి...

No comments:

Post a Comment