Sunday, January 2, 2011

బ్రిజేష్‌ తీర్పుతోనైనా పార్టీల కళ్లు తెరుచుకుంటాయా?

కృష్ణా జలాలపై బ్రిజేష్‌ కుమార్‌ వెలువరించిన తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన రాజకీయ పార్టీలు కళ్లు తెరవాల్సిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్‌ నిట్టనిలువునా చీలి ప్రాంతాలవారీగా కుమ్ములాడుకుంటుంటే ఎగువ రాష్ట్రాలు రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలను తన్నుకు పోతున్నాయి. రాష్ట్రం ఎడారయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఎగువ రాష్ట్రాల్లోని రాజకీయపార్టీలు వారి వారి రాష్ట్ర ప్రయోజనాలకోసం కలిసి పని చేస్తుంటే మన దౌర్భాగ్యం కొద్ది మన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సొంత ప్రయోజనాలు, ఓట్ల కోసం, అధికారం కోసం తాపత్రయ పడుతున్నాయి. అంతర్గత గొడవల్లో కొన్ని పార్టీలు, ఎదుటి పార్టీలపై పైచేయి సాధించాలని కొన్ని పార్టీలు, రాజకీయాధికారం కోసం కొన్ని పార్టీలు కీచులాడుకుంటున్నాయి.

గతంలో ఆల్మట్టిపై టిడిపి ఏం చేసిందంటూ కాంగ్రెస్‌ నేతలు, బాబ్లీ, ప్రస్తుత బ్రిజేష్‌ కుమార్‌ తీర్పు రావడానికి కాంగ్రెసే కారణమని టిడిపి నేతలు ఆరోపించుకుంటున్నారు. కిరణ్‌కుమార్‌ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని శాపనార్ధాలు పెడుతున్న జగన్‌ అయితే బ్రిజేష్‌ తీర్పు రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా రావడానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు తగ్గించి గతంలో ఎప్పుడో చంద్రబాబు ఆల్మట్టిపై తప్పు చేశారని ఆరోపిస్తున్నారు.

ప్రాంతీయ గొడవలు సరేసరి. టిడిపి, కాంగ్రెస్‌ పార్టీల్లోని తెలంగాణ ప్రాంత నేతలు బ్రిజేశ్‌ తీర్పుపై నోరు మెదపట్లేదు. ఆ పార్టీలోని సీమాంధ్ర నేతలు రాష్ట్రానికి నష్టమని రాద్ధాంతం చేస్తున్నారు. అందుక్కారణం లేకపోలేదు. ప్రత్యే రాష్ట్రం కోరుతున్న టిఆర్‌ఎస్‌ ఏం మాట్లాడితే అది మాట్లాడటం అలవాటు చేసుకున్న తెలంగాణ ప్రాంత ఆ పార్టీల నేతలు టిఆర్‌ఎస్‌ ఏం చెబుతుందా అని ఎదురు చూస్తున్నారు. బ్రిజేష్‌ తీర్పువల్ల మహబూబ్‌నగర్‌, నల్గొండ, హైదరాబాద్‌ వాసులకు నష్టమని తెలిసినప్పటికీ టిఆర్‌ఎస్‌ నేతలు పెద్దగా స్పందించట్లేదు. సీమాంధ్ర జిల్లాలకే నష్టమన్నట్లు, తెలంగాణాకు లాభం అన్నట్లు ప్రచారం ప్రారంభించారు. ఎలాగూ రాష్ట్రం విడిపోతే మళ్లీ నదీ జలాలను పంచాల్సి వస్తుంది కనుక బ్రిజేష్‌ తీర్పుపై పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నట్లుంది వీరి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మిగులు జాలాలు మొత్తం తెలంగాణాకే కావాలంటున్నారు కొందరు తెలంగాణా వాదులు. బాబ్లీ కడితే శ్రీరాంసాగర్‌ ఎండిపోతుందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయని భ్రమింపజేస్తున్నారు. ప్రతి సమస్యకూ తెలంగాణా రాష్ట్రంతో ముడిపెడుతున్నారు.

నదీ జలాల విషయంలో ఉన్న రాష్ట్రాల మధ్యనే గొడవలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రెండో మూడో కాదంటే ఐదో రాష్ట్రాలుగా విడిపోతే ఇప్పుడున్న వివాదాలకు మూడు రెట్ల వివాదాలొస్తాయి. బ్రిజేశ్‌ తీర్పు ఫైనల్‌ కాదని, అందరి సలహాలూ తీసుకొని వాదిస్తామంటున్నారు ముఖ్యమంత్రి. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ వద్ద రాష్ట్రం తరఫున వాదించే సమయంలోనూ అందరి సలహాలు తీసుకున్నారు. అయినా రాష్ట్రానికి అన్యాయం చేసే తీర్పు ఎందుకొచ్చిందో ఇప్పటి ముఖ్యమంత్రి, కాకుంటే గత ముఖ్యమంత్రులు, ఆయన వారసులు సమాధానం చెప్పాలి.

రాజకీయ లబ్ధి కోసం కాకుండా అత్యధిక ప్రజలకు ప్రయోజనం కలిగే నిర్ణయాలు తీసుకుంటే ఆయా పార్టీలకు అంతే మొత్తంలో పెద్ద మద్దతు లభిస్తుంది. అప్పటికప్పుడు వేడిలో అంతా బాగుందనిపించినా ఇప్పటి పార్టీల వైఖరి వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుంది. బ్రిజేష్‌ తీర్పుతోనైనా రాజకీయపార్టీలు కళ్లు తెరుస్తాయని, తమ బాధ్యతను నెరవేరుస్తాయని ఆశిద్దాం.

1 comment:

  1. "మనకు నీళ్ళు రాకున్నా పరవాలేదు, దిగువ ఆంధ్రులకు చుక్క నీరు అందకూడదు" అన్న తెరాస పాలసీకి ఇది అనుకూలంగా వుంది. తెలంగాణా రాజకీయ నాయకులెవరూ ఈవిషయంపై వ్యాఖ్యానించడం లేదు. నీళ్ళూ లేకుంటే ఆంధ్రోళ్ళూ ఇంకేదో చేసుకుంటారు, మరి అసలే వెనకబడ్డ తెలంగాణ వాళ్ళు, 'ఆంధ్రోళ్ళను ' ఆడిపోసుకోవడానికి ఓ కారణం పోయినట్లే. :))

    ReplyDelete