Saturday, January 22, 2011

ముందు 'ఆరు'... తర్వాత 'ఐదు'

రాష్ట్ర పరిస్థితులపై ఏడాది పాటు అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ ఆరు సూత్రాలను ప్రతిపాదించింది. వాటిలో ఐదు, ఆరు సిఫారసులపైనే రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. కేంద్రం, కాంగ్రెస్‌ అధిష్టానం సైతం ఆ రెండింటిపైనే సమాలోచనలు చేస్తున్నప్పటికీ శ్రీకృష్ణ కమిటీ చేసిన బెస్ట్‌ ఆప్షన్‌ అయిన ఆరోదాని వైపు కేంద్రం మొగ్గు చూపినట్లు కనబడుతోంది. ఆరో సూచనే తమ విధానమని కేంద్రం ఇప్పటికిప్పుడు స్పష్టం చేసే పరిస్థితి లేదు. అలా ప్రకటిస్తే తెలంగాణా ప్రాంతంలో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని దానికి తెలుసు. అలా అని ఐదో సూచన అయిన రాష్ట్ర విభజనకు పూనుకుంటే సీమాంధ్రలో పార్టీ గల్లంతవుతుంది. కాబట్టి మధ్యే మార్గంగా 2014 వరకూ ఏ నిర్ణయం తీసుకొని కాలయాపన చేయాలా అనే దిశగా కాంగ్రెస్‌ సమాలోచనలు జరుపుతోంది. సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలకూ సంతృప్తి కలిగించే నిర్ణయాన్ని వెతికి పట్టుకుంది కాంగ్రెస్‌.

మరో మూడేళ్లపాటు శ్రీకృష్ణ చెప్పిన ఆరో సూచనను అమలు చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ అభివృద్ధికి రాజ్యాంగ బద్ధ గ్యారంటీలు ఇవ్వాలి. ఇప్పుడు పార్లమెంట్‌లో 2/3 మెజార్టీ సాధించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆరో సూచనకు బిజెపి ఒప్పుకోదు. రాజకీయంగా నోటిమాటపై ఆరో సూచనను మూడేళ్లపాటు అమలు చేస్తానంటూ ప్రతిపాదిస్తుంది కేంద్రం, కాంగ్రెస్‌ హైకమాండ్‌. అప్పటికీ తెలంగాణాకు అన్యాయం జరిగినట్లు ఆ ప్రాంత ప్రజలు భావించిన పక్షంలో, లేక ఈ ప్రాంత అభివృద్ధి జరగని పక్షంలో ఐదో సూచనను మూడేళ్ల తర్వాత అమలు చేస్తానంటూ ప్రతిపాదిస్తుంది.

మూడేళ్లు యథాతథ స్థితి కొనసాగిస్తామనడం అంటే 2014లో జరిగే ఎన్నికల వరకూ ఏమీ తేల్చదన్నమాట. ఎన్నికల ముందు ఎలాగూ కొన్ని హామీలిస్తుంది. కేంద్రంలో, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ గెలిస్తే అప్పటి సంగతి అప్పుడు చూసుకుంటుంది. ఎలాగూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదని ఆ పార్టీకి అర్థమైంది. ఇక కేంద్రంలో ఎలా ఉంటుందో చెప్పలేని స్థితిలో ఉంది. ప్రస్తుతానికి ముందుగా ఆరో సూత్రం, తర్వాత ఐదో సూత్రం అని కాంగ్రెస్‌ చెప్పనుంది. ఎంపీలను ఈ ప్రతిపాదనలపై డ్రైవ్‌ చేస్తోంది.

No comments:

Post a Comment