Monday, January 31, 2011

శంకర్రావు గడబిడ

చేనేత, జౌళి శాఖా మంత్రి శంకర్రావుకు నిజంగానే బెదిరింపు కాల్స్‌ వచ్చాయా? ఆ ఫోన్లకు మంత్రి భయపడ్డారా? మంత్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదా?... వైఎస్‌ సిఎంగా ఉండగా శంకర్రావు తెరమరుగయ్యారనే చెప్పాలి. మంత్రి పదవి రాలేదని ఒకటి రెండుసార్లు అసంతృప్తి వ్యక్తం చేయడానికే పరిమితమయ్యారు. పెద్దగా అసెంబ్లీకి వచ్చింది కూడా లేదు. అప్పట్లో కాకా కుమారుడు వినోద్‌ కేబినెట్‌లో ఉన్నందున కాకా అల్లుడైన శంకర్రావును తీసుకోలేదని వార్తలొచ్చాయి. వైఎస్‌ చనిపోయాక సిఎల్పీని వేదికగా చేసుకొని వైఎస్‌, ఆయన కుటుంబంపై విమర్శలు చేసిన ఆయనకు గత డిసెంబర్‌లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో బెర్తు దక్కింది. మంత్రి అయ్యాక కూడా సిఎల్పీలోనే ఆయన ఎక్కువగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారు.

Friday, January 28, 2011

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లొల్లి

మ్యాచ్‌ ఫిక్సింగ్‌... కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఈ మాట బాగా వినిపిస్తోంది. ఒకరిపై ఒకరు మీరు ఫలాన వారితో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని తరచు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు నేతలు. ఏ రోజు ఎవరు ఈ మాట అంటారో, ఎవరు ఏ రోజు ఎవరితో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారో తెలీక ప్రజలు గందరగోళంలో పడుతున్నారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అనే పదం గతంలో టిడిపి, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ మధ్య ఆరోపణగా సాగింది. ఈ మూడు పార్టీల్లో ఒకరు మిగిలిన ఇద్దరితో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

Thursday, January 27, 2011

కిరణ్‌×జగన్‌... పేలుతున్న మాటల తూటాలు

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, వైఎస్‌ జగన్మోహన రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం తర్వాత పరిస్థితిలో కొంత మార్పొచ్చింది. కోర్‌ కమిటీకి ముందు వరకూ జగన్‌, ఆయన శిబిరంపై సిఎం నేరుగా వ్యాఖ్యలు చేయలేదు. డిఎల్‌ రవీంద్రారెడ్డి, శంకర్రావు, తులసిరెడ్డి వంటి నేతలు మాత్రమే కౌంటర్లు ఇస్తూ వచ్చారు. ఢిల్లీలో జగన్‌ జలదీక్ష అనంతరం జరిగిన కోర్‌ కమిటీ భేటీ ముగిసిన వెంటనే కిరణ్‌ వాగ్బాణాలు సంధించారు. ఎవరి దయాదాక్షిణ్యాల పైనా తమ ప్రభుత్వం నడవడం లేదని, ఆ మాటకొస్తే వైఎస్‌ను రెండుసార్లు సిఎంగా చేసిన కాంగ్రెస్‌కు ఆయన కుటుంబం రుణ పడి ఉండాలని అన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా సర్కార్‌కేమీ కాదని స్పష్టం చేశారు.

Wednesday, January 26, 2011

నల్లధనంపై కాంగ్రెస్‌ దొంగాట ఎందుకు?

విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల ధనాన్ని తిరిగి దేశానికి రప్పించడానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది? కనీసం వివరాలనైనా ఎందుకు వెల్లడించట్లేదు? వివరాలు బహిర్గతం చేస్తే ప్రళయం, సునామీ వస్తుందన్న తీరున ఆందోళన చెందడానికి వెనుక కారణాలేమిటి? ఈ ప్రశ్నలు సగటు జీవుల మెదళ్లను తొలుస్తున్నాయి. దేశం వెలుపల మన వాళ్లు దాచిన నల్ల ధనాన్ని వెలికి తీస్తామని 2009 ఎన్నికల్లో బిజెపి నినాదం ఎత్తుకుంది. ఆ నినాదం ఎత్తుకుంది కాబట్టి బిజెపి స్వచ్ఛమైన పార్టీ అనుకుంటే పొరపాటే అవుతుంది. బ్లాక్‌ మనీని దాచే 'పెద్ద'లతో అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు సైతం బిజెపి చెట్టపట్టాలేసుకు తిరిగింది. కేవలం ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవడం కోసమే బిజెపి బ్లాక్‌ మనీ నినాదం ఎత్తుకుంది. బిజెపి ఆ హామీ ఇచ్చింది కనుక కాంగ్రెస్‌ తప్పని పరిస్థితుల్లో నల్లధనం అంశం ఎన్నికల్లో ప్రస్తావించింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నల్ల ధనాన్ని వెలికి తీసి దేశానికి రప్పిస్తామని ప్రజలకు వాగ్దానం చేసింది.

Tuesday, January 25, 2011

ఎటిఎం..ఎనీ టైం మందు

పూణె పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరం. అక్కడి ప్రజలు పని ఒత్తిడి వల్ల బిజీగా గడుపుతుంటారట. కనీసం తమ కుటుంబం కోసం పాలు కొనుక్కొనే తిరిక కూడా చిక్కట్లేదట. అక్కడి పాల సహకార సంఘం ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది. గుజరాత్‌లో అక్కడక్కడ ఏర్పాటు చేసినట్లుగానే పూణెలోనూ ఎటిఎంలను ఏర్పాటు చేయాలనుకుంది. ఎటిఎం అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆటోమెటిక్‌ టెల్లర్‌ మిషన్‌. డబ్బు తీసుకుంటున్నారు కాబట్టి ఎనీ టైం మనీ అని కూడా అంటున్నారు సాధారణ ప్రజలు. పూణెలో ఏర్పాటు చేసేది ఎనీ టైం మిల్క్‌. క్రెడిట్‌కార్డు లేదా డెబిట్‌కార్డు వినియోగిస్తే లేదా కాఫీ మిషన్‌ టైపులో డబ్బులు వేస్తే పాలొస్తాయి. ఏ సమయంలోనైనా ఉద్యోగులు పాల కోసం ఎటిఎంను వాడుకోవచ్చు. త్వరలో పూణెలో ఈ ఎటిఎంలు రాబోతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఐడియా వచ్చిందట. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చెస్తుంది అన్నట్లు ఆ ఐడియాతో ఇప్పుడు మద్యంపై వచ్చే ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం తెచ్చుకోవచ్చని సర్కార్‌ ఉబలాట పడుతోందంటున్నారు. 

Sunday, January 23, 2011

ఎవరికి ఎవరు రుణ పడాలి?

ఎవరికి ఎవరు రుణ పడాలి? కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ కుటుంబం రుణ పడాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అంటుండగా.. కాదు రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్‌కే కాంగ్రెస్‌ రుణ పడాలంటున్నారు జగన్‌, ఆయన మద్దతుదార్లు. వీరి వాదనలను పరిష్కరించేదెవరు? రెండు పక్షాల వాదనలూ సబబుగానే కనబడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పతనమైనప్పుడు కాంగ్రెస్‌కు జవసత్వాలు నింపిన వారు వైఎస్‌. 1994లో ఎన్టీఆర్‌ రెండోసారి సృష్టించిన ప్రభంజనానికి కాంగ్రెస్‌ 26 ఎమ్మెల్యే స్థానాలకు పడిపోయింది. కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హౌదా కూడా దక్కలేదు. ఆ దెబ్బతో పదేళ్లపాటు కాంగ్రెస్‌ కోలుకోలేదు. 

Saturday, January 22, 2011

ముందు 'ఆరు'... తర్వాత 'ఐదు'

రాష్ట్ర పరిస్థితులపై ఏడాది పాటు అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ ఆరు సూత్రాలను ప్రతిపాదించింది. వాటిలో ఐదు, ఆరు సిఫారసులపైనే రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. కేంద్రం, కాంగ్రెస్‌ అధిష్టానం సైతం ఆ రెండింటిపైనే సమాలోచనలు చేస్తున్నప్పటికీ శ్రీకృష్ణ కమిటీ చేసిన బెస్ట్‌ ఆప్షన్‌ అయిన ఆరోదాని వైపు కేంద్రం మొగ్గు చూపినట్లు కనబడుతోంది. ఆరో సూచనే తమ విధానమని కేంద్రం ఇప్పటికిప్పుడు స్పష్టం చేసే పరిస్థితి లేదు. అలా ప్రకటిస్తే తెలంగాణా ప్రాంతంలో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని దానికి తెలుసు. అలా అని ఐదో సూచన అయిన రాష్ట్ర విభజనకు పూనుకుంటే సీమాంధ్రలో పార్టీ గల్లంతవుతుంది. కాబట్టి మధ్యే మార్గంగా 2014 వరకూ ఏ నిర్ణయం తీసుకొని కాలయాపన చేయాలా అనే దిశగా కాంగ్రెస్‌ సమాలోచనలు జరుపుతోంది. సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలకూ సంతృప్తి కలిగించే నిర్ణయాన్ని వెతికి పట్టుకుంది కాంగ్రెస్‌.

Friday, January 21, 2011

టాలీవుడ్‌ హీరోలే మాఫియాకు బాధ్యులు

టిడిపి నాయకుడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెర్వు సూరి... కరడుగట్టిన ఫ్యాక్షన్‌ లీడర్‌ అయిన ఆ సూరి హైదరాబాద్‌ నడిబొడ్డున తన అనుచరుడు భాను కిరణ్‌ చేతిలో హత్యకు గురయ్యాడు. సూరి హత్య కేసు తెలుగు సినీ పరిశ్రమకు తగులుకుంది. సూరి, భాను చేసిన సెటిలిమెంట్లు, వాటికీ సినిమా ప్రముఖులకు మధ్య నెలకొన్న సంబంధాలు పుట్ట నుండి పాముల్లా ఒక్కటొక్కటి బయటికొస్తున్నాయి. ఏళ్ల తరబడి ఫ్యాక్షనిస్టుల దందాలు రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వేళ్లూనుకున్నా, టాలీవుడ్‌లోని ప్రముఖులు దందా రాయుళ్లతో పెనవేసుకు పోయినా పోలీసులు, ఇంటెలిజెన్స్‌కు ఎందుకు సమాచారం రాలేదన్నది ప్రధాన ప్రశ్న.

Thursday, January 20, 2011

జైపాల్‌రెడ్డికి పెట్రోలియం శాఖ దక్కడం వెనుక..?!

కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఈసారి కూడా మన రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలకు నిరాశే మిగిల్చింది. రాష్ట్రం నుండి 33 మంది గెలిచినా తగిన సంఖ్యలో మంత్రులను తీసుకోలేదన్న అసంతృప్తి ఎంపీల్లో నెలకొంది. కేబినెట్‌ మంత్రి గతంలో ఒక్కరే ఉండేవారు. ఇప్పుడూ అంతే. కీలకమైన శాఖలు సైతం రాష్ట్రానికి ఇవ్వట్లేదన్న విమర్శిస్తున్న చేస్తున్న వారికి ఈసారి కొద్దిపాటి ఊరట కలిగింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌రెడ్డికి కీలకమైన పెట్రోలియం, సహజ వాయువుల శాఖను కట్టబెట్టారు. ఇప్పటి వరకూ ఆయన పట్టణాభివృద్ధి శాఖను నిర్వహించారు. జైపాల్‌రెడ్డికి పెట్రోలియం శాఖ దక్కడానికి వ్యాపార దిగ్గజం చక్రం తిప్పారని భోగట్టా.

Tuesday, January 18, 2011

శ్రీకృష్ణ కమిటీ తెలుగు నివేదిక

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ గత నెల 30న కేంద్ర హౌం మంత్రి చిదంబరానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికను ఈ నెల 6న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రం విడుదల చేసింది. కాగా నివేదిక తెలుగు ప్రతిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. తెలుగు నివేదికను మా బ్లాగ్‌లో ఉంచాము. దర్శించ గలరు.

Sunday, January 16, 2011

సంక్రాంతిపై అర్థం లేని వాదనలు

సంక్రాంతి ఎవరి పండుగ? ఆంధ్రా వాళ్ల పండుగని ఏడాది నుండి ప్రచారం జరుగుతోంది. కెసిఆర్‌ నిరాహారదీక్ష, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలు ఊపందుకున్న తరుణంలో నిరుడు సంక్రాంతి ప్రస్తావన వచ్చింది. తెలంగాణ రాజకీయ జెఎసి, ఓయు విద్యార్థి జెఎసి అయితే లక్షలాదిగా సంక్రాంతి పండగ చేసుకోడానికి ఇక్కడి నుండి వెళ్లే ఆంధ్రా వాళ్లను తిరిగి తెలంగాణాలో, హైదరాబాద్‌లో అడుగు పెట్టనీయబోమని గత ఏడాది ఇదే రోజుల్లో హెచ్చరించారు. అంతేకాదు కొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా తాత్కాలిక గోడలు సైతం నిర్మించారు. ఈ చర్యలు ఆంధ్రా వాళ్ల మనోభావాలను కలిచివేశాయి. అప్పట్లో టిఆర్‌ఎస్‌ దాని అనుబంధ సంఘాలు సైతం సంక్రాంతి ఆంధ్రావాళ్ల పండుగన్నాయి. వచ్చే సంక్రాంతితో ఆంధ్రా వాళ్ల పీడ విరగడవుతుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తుందని టిఆర్‌ఎస్‌, జెఎసి నేతలు ఇప్పుడు ఆశాభావం వెలిబుచ్చారు. 

Wednesday, January 12, 2011

ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా కిరణ్‌ సర్కార్‌ పడిపోదా?

తాను తలుచుకుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కూలుతుందంటున్నారు వైఎస్‌ జగన్‌. తమ సర్కార్‌కు జగన్‌ వల్ల ముప్పు ఉండబోదంటున్నారు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ. జగన్‌ దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం నడవట్లేదని, దమ్ముంటే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్‌ విసురుతున్నారు మంత్రులు డిఎల్‌ రవీంద్రారెడ్డి, శంకర్రావు, తులసిరెడ్డి తదితరులు. జగన్‌ కానీ కాంగ్రెస్‌ నేతలు కానీ ఎవరు ఏం చెప్పినా సామాన్యులకు మాత్రం ప్రభుత్వ మనుగడపై అంతుబట్టకుండా ఉంది. కిరణ్‌కుమార్‌ సర్కార్‌ ఉంటుందా ఊడుతుందా అని లెక్కలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మీడియాలోనైతే నైతికంగా సర్కార్‌ మైనార్టీలో పడ్డట్లేనంటూ వార్తలొస్తున్నాయి.

Monday, January 10, 2011

మీడియా అన్నింటికీ అతీతమా?

మీడియా అన్నింటికీ అతీతమా? ఎటువంటి చట్టాలూ దానికి అమలు కాకూడదా? స్వతంత్రంగా వదిలేయాలా? ఎప్పటి నుండో మీడియా పాత్రపై విస్తృతంగా ఈ చర్చ జరుగుతోంది. ముంబయిపై ఉగ్రవాది దాడి తర్వాత మీడియా పాత్ర వివాదాస్పదమైంది. స్వీయ నియంత్రణను నొక్కి చెబుతున్నప్పటికీ దాని అమలు ఎప్పటికప్పుడు ప్రశ్నార్ధకమవుతోంది. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్శిటీలో ఆందోళనల కవరేజిపై, చానళ్ల ప్రసారాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటున్నారు తెలంగాణాలోని కొన్ని పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, ఓయు విద్యార్థులు. ఎమర్జెన్సీని తలపిస్తోందని మండి పడుతున్నారు. మీడియాపై ఆక్షలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టంటున్నాయి చాలా చానళ్లు. ఆంక్షలు తొలగించాలని నేతలు, చానళ్ల సిఇఓలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం, పోలీసులు మాత్రం మీడియాపై ఆంక్షల్లేవంటున్నారు. టీవీ ప్రసారాలపై నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్లు (ఎన్‌బిసి) రూపొందించుకున్న మార్గదర్శకాలను అమలు చేయాలంటున్నామని డిజిపి అరవిందరావు, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఎకె ఖాన్‌ చెబుతున్నారు. హౌం మంత్రి సబితారెడ్డి సైతం ఆంక్షల్లేవన్నారు.

Sunday, January 9, 2011

శ్రీకృష్ణా..ఆచరణ సాధ్యం కాని సిఫారసులెందుకు?

శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమీబాలాంటిదంటున్నారు పలువురు రాజకీయ నేతలు. టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ అయితే ఎవరికిష్టమొచ్చినట్లు వారు నివేదికను అన్వయించుకోవచ్చన్నారు. శ్రీకృష్ణ నివేదికలో కొత్తదనం ఏమీ ఉండదని ఈ నెల 6న ఢిల్లీలో చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కెసిఆర్‌ హాజరు కాలేదు. కాని శ్రీకృష్ణ నివేదిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం కాదని భాష్యం చెప్పారు. కెసిఆర్‌ అంతటి వారే నివేదికను తనకు అనుకూలంగా అన్వయించుకున్నారంటే సామాన్యులు ఆ పని చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. 

Sunday, January 2, 2011

బ్రిజేష్‌ తీర్పుతోనైనా పార్టీల కళ్లు తెరుచుకుంటాయా?

కృష్ణా జలాలపై బ్రిజేష్‌ కుమార్‌ వెలువరించిన తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన రాజకీయ పార్టీలు కళ్లు తెరవాల్సిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్‌ నిట్టనిలువునా చీలి ప్రాంతాలవారీగా కుమ్ములాడుకుంటుంటే ఎగువ రాష్ట్రాలు రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలను తన్నుకు పోతున్నాయి. రాష్ట్రం ఎడారయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఎగువ రాష్ట్రాల్లోని రాజకీయపార్టీలు వారి వారి రాష్ట్ర ప్రయోజనాలకోసం కలిసి పని చేస్తుంటే మన దౌర్భాగ్యం కొద్ది మన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సొంత ప్రయోజనాలు, ఓట్ల కోసం, అధికారం కోసం తాపత్రయ పడుతున్నాయి. అంతర్గత గొడవల్లో కొన్ని పార్టీలు, ఎదుటి పార్టీలపై పైచేయి సాధించాలని కొన్ని పార్టీలు, రాజకీయాధికారం కోసం కొన్ని పార్టీలు కీచులాడుకుంటున్నాయి.