Sunday, March 27, 2011

ప్రజలే వెర్రి వెంగళప్పలు!

ప్రభుత్వ భూములను తమకు ఇష్టమైన వారికి అప్పనంగా పందేరం చేసిన వ్యవహారం ఉభయ సభలనూ కుదిపేస్తోంది. శాసనసభలోనైతే వారం రోజులుగా ఈ అంశంపై చర్చ లేకుండానే రగడ జరుగుతోంది. వాస్తవానికి వైఎస్‌ బతికుండగానే, గత శానసభలో చాలాసార్లు భూపందేరంపై చర్చ జరిగింది. అప్పటి స్పీకర్‌ సురేష్‌రెడ్డి మీద టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున సుదీర్ఘంగా సాక్షిలో పెట్టుబడులపైనా చర్చ జరిగింది. మన 'ప్రజాస్వామ్యం'లో ఎన్ని చర్చలు జరిగినా దోషులపై పెద్దగా చర్యలుండవు. ఆ సంగతి ప్రజలకూ, పార్టీలకు తెలుసు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో మళ్లీ భూపందేరంపై చర్చకు టిడిపి పట్టుబట్టింది. జగన్‌కు హైకోర్టు, ఐటి నోటీసులు జారీ చేయడం, జగన్‌ కాంగ్రెస్‌ నుండి వీడటంతో మరొకసారి సెజ్‌లు, భూముల పందేరం తెరమీదికొచ్చింది. సమర్ధవంతంగా చర్చ జరిగి అక్రమార్కులను గుర్తించి చర్యలు తీసుకుంటే ఎవరూ కాదనరు. అలాగే ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తే అందరికీ సమ్మతమే. కాని ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం ప్రధాన పార్టీలు, నేతల పాకులాట రోత పుట్టిస్తోంది.

Friday, March 25, 2011

దొంగల ముఠాకు రాణి సోనియాగాంధీ కాదంటారా?

శ్రీకృష్ణ కమిటీ దొంగల ముఠా అని, దాని నాయకుడు ఎవరో తేలాల్సి ఉందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీ ఆవరణలో విమర్శలు చేశారు. ఈ విమర్శ టిఆర్‌ఎస్‌ చేస్తే పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు. మరేదేని ప్రతిపక్షాలు చేసినా కొట్టిపారేయవచ్చు. అయితే ఉద్యమపార్టీగా చెపుతున్న టిఆర్‌ఎస్‌ కూడా శ్రీకృష్ణ కమిటీపై రెండు విధాలుగా స్పందించింది. తొలుత శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటును వ్యతిరేకించింది. దానికి నిర్ధారించిన విధి, విధానాలొచ్చాక టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అంతలోనే శ్రీకృష్ణ కమిటీకి టిఆర్‌ఎస్‌ నివేదిక ఇచ్చింది. 2010 జనవరిలో చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ సైతం సంతకం చేసిన విషయాన్ని మరవరాదు. 2004లో కాంగ్రెస్‌కు, టిఆర్‌ఎస్‌కు ఎన్నికల పొత్తు కుదిరినప్పుడు రెండో ఎస్సార్సీకి టిఆర్‌ఎస్‌ నేతలు ఒప్పుకుంటూ సంతకం పెట్టారు. యుపిఎ తన మేనిఫెస్టోలో పరస్పర చర్చలు, ఏకాభిప్రాయం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఇస్తామంది. అంతేకాకుండా అసెంబ్లీలో మెజార్టీ తెలంగాణా రాష్ట్రాన్ని బలపరుస్తూ తీర్మానం ఆమోదిస్తేనే పార్లమెంట్‌లో బిల్లు పెడతామని, సోనియాగాంధీ నాయకత్వం వచ్చాక పార్టీ అవలంబిస్తున్న విధానం ఇదేనని స్పష్టం చేసింది.

మొన్న పారిన పాచికలు నిన్న ఎందుకు పారలేదు?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పారిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాచికలు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పారలేదు? మొన్నటి ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుచుకున్నప్పుడు వీరుడు సూరుడు అని సిఎంను ములగచెట్టు ఎక్కించిన మంత్రులు, నేతలు నిన్నటి ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన అదే సిఎంను ఎందుకు తూలనాడుతున్నారు? కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆయనకు తొలి పరాభవం కాగా కాంగ్రెస్‌ను వీడిన జగన్‌కు తొలి విజయం. ఇక తెలుగుదేశం విషయానికొస్తే రెండు సీట్లు బోనస్‌గా వచ్చినందుకు సంతోషించాలో, కడప, చిత్తూరులో కాంగ్రెస్‌కు సహకరించినప్పటికీ జగన్‌ గెలిచినందుకు బాధ పడాలో తెలీని సంకట స్థితిలో ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు కూడా కడప జిల్లా మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి గెలుపు తమదేనన్నారు. ఇప్పుడేమో ఇవి చిన్న ఎన్నికలని, జగన్‌ డబ్బులు వెదజల్లారని మాట్లాడుతున్నారు. జగన్‌ డబ్బులు వెదజల్లారు సరే, కాంగ్రెస్‌ అసలు డబ్బులే ఖర్చు చేయలేదా? కడప సీటు కోసం అధిష్టానం పంపిన డబ్బు మొత్తాన్నీ డిఎల్‌ ఖర్చు చేయలేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

Friday, March 18, 2011

కిరణ్‌ సక్సెస్‌..పారని జగన్‌ ఝలక్‌...బాబుకు పరాభవం

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఫలితాలు ఒక్కో పార్టీకి ఒక్కో రకంగా గుణపాఠాలు నేర్పుతున్నాయి. ఖాళీ అయిన మూడు గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాలో ప్రోగ్రెసిట్‌ డెమక్రటిక్‌ ఫ్రంట్‌ (పిడిఎఫ్‌) అభ్యర్ధులు విజయం సాధించారు. పట్టభద్రులు 46 శాతం మందే ఓటింగ్‌లో పాల్గొనడాన్నిబట్టి చదువుకున్న వారు ఎన్నికలపై నిరాసక్తత వ్యక్తం చేశారో లేక పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లడానికి బద్ధకించారో తెలీదుకాని 54 శాతం మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉండటంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వెల వెలబోయింది. పోలైన ఓట్లలో పిడిఎఫ్‌ అభ్యర్ధులు గెలవడాన్నిబట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రజా సమస్యలపై గళమెత్తే అభ్యర్ధులకు పట్టభద్రులు ఓటేశారని అర్థమవుతుంది. ఇక మూడు టీచర్‌ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో పిఆర్‌టియు బలపర్చిన ఇద్దరు అభ్యర్ధులు, యుటిఎఫ్‌ మద్దతుతో పిడిఎఫ్‌ అభ్యర్ధి ఒకరు గెలుపొందారు. ఏది ఏమైనా తమ సమస్యలపై పోరాడిన వారిని టీచర్లు ఎన్నుకున్నట్లు అనిపిస్తుంది.

Thursday, March 17, 2011

విగ్రహాల ధ్వంసంపై జగన్‌కు మౌనమేల?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ ప్రకటన ఈ నెల 10న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్‌ నోటి నుండి వెలువడింది. సరిగ్గా ఆ సమయంలోనే హైదరాబాద్‌లో ట్యాంక్‌ బండ్‌పై జరిగిన మిలియన్‌ మార్చ్‌లో తెలుగు వైతాళికుల విగ్రహాల విధ్వంసం జరిగింది. మిలియన్‌ మార్చ్‌ను నిర్వహించిన తెలంగాణ రాజకీయ జెఎసి కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ సైతం విగ్రహాల విధ్వంసాన్ని తొలుత ఖండించారు. మిలియన్‌ మార్చ్‌కు పిలుపునిచ్చిన బిజెపి, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమాక్రసీతో పాటు మార్చ్‌కు సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, తెలంగాణ టిడిపి ఫోరం నేతలు, సిపిఐ నేతలు సైతం విగ్రహాల ధ్వంసాన్ని తప్పుబట్టారు. ఆ పార్టీలతో పాటు మార్చ్‌కు దూరంగా ఉన్న పార్టీలు, నేతలు, కవులు, కళాకారులు అందరూ విగ్రహాల విధ్వంసంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Wednesday, March 16, 2011

కోత కాదు రిలీఫ్‌

అదేదో సినిమాలో హీరో మహేష్‌బాబు 'బుల్లెట్‌ దిగిందా లేదా అన్నదే ముఖ్యం' అన్నట్లుగా కరెంట్‌ కట్‌ అవుతుందా లేదా అన్నది మాత్రమే ప్రజలకు కావాలి. విద్యుత్‌ కోతపై మంగళవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు వింటే మహేష్‌బాబు సినిమాలోని పై డైలాగ్‌ గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో ఎడాపెడా కరెంట్‌ కోతలు పెడుతున్నారు. రాజధాని హైదరాబాద్‌లోనే అధికారికంగా గంటసేపు కట్‌ అమల్లో ఉంది. హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీల్లో రోజుకు 2-3 గంటలు కోత కోస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో మూడు గంటలు, మండల కేంద్రాల్లో ఐదారు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో పది గంటల విద్యుత్‌ కోత అమలవుతోంది. ట్రాన్స్‌కో, డిస్కం అధికారులు అధికారికంగా కోతల వేళలు ప్రకటించారు.

Tuesday, March 15, 2011

ఆ బుద్ధి ముందే ఉండాలి

అధికారపక్ష సభ్యులై ఉండి ప్రతిపక్షం వారి వలే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం మంచి పద్ధతి కాదని ఇక నుండి సమావేశాలకు హాజరు కావాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఇన్నాళ్లకు తెలిసొచ్చింది. ఈ బుద్ధి బహిష్కరించక ముందు ఏమైంది? తాము అధికారపక్షమో ప్రతిపక్షమో తెలీని స్థితిలో ఎమ్మెల్యేలున్నారా? ట్యాంక్‌ బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీలు కేకే, మధుయాష్కీకి జరిగిన ఘోర పరాభవం తర్వాత టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు బుద్ధి వచ్చిందనుకోవాలా? పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర బిల్లు, రాష్ట్ర శాసనసభలో తీర్మానం పెట్టేంత వరకూ అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గత నెల 25న ప్రకటించారు. అధికారపక్షమే సమావేశాలను బహిష్కరిస్తుంటే మనమెందుకు సభకెళ్లాని టిఆర్‌ఎస్‌ కూడా అసెంబ్లీని బహిష్కరించింది. ఆ రెండు పార్టీలూ బహిష్కరిస్తే నేను తక్కువ తిన్నానా అని తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు సైతం బహిష్కరించారు.