Saturday, February 26, 2011

ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు?

ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నా, పడకేసినా, అటకెక్కినా ఎందుకు నోరు మెదపట్లేదు? గొంతు పెగలట్లేదా లేక మనకెందుకులే ఆ గొడవంతా అనుకొని, దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని తమ 'పని' తాము చేసుకుపోతున్నారా? ప్రతి ఏడాదీ రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ప్రజలు ఆశించడం, షరా మామూలే అన్నట్లు వారికి ఆశాభంగం ఎదురు కావడం ఆనవాయితీగా మారింది. బడ్జెట్‌లో కనిపిస్తున్న రైల్వే లైన్ల పేర్లు ఇరవై ముప్పై ఏళ్లగా వింటున్నవే. ఎప్పటికప్పుడు కొత్తగా చెబుతున్నారు తప్ప పూర్తి చేయడం లేదు. పూర్తి చేయించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, రాష్ట్రం నుండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న పెద్ద మనుషులు గాలికొదిలేశారు.

Friday, February 25, 2011

జగన్‌ స్వరం మారుతూ..వుంది

వైఎస్‌ జగన్‌ స్వరం మారుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన కొన్ని రోజులకే అంటే గత ఏడాది నవంబర్‌ 25న కిరణ్‌ ప్రమాణస్వీకారం చేయగా 29న జగన్‌ పార్టీ నుండి బయటికొచ్చారు. ఆ తర్వాత ప్రతి మీటింగ్‌లోనూ తన తండ్రి కష్టపడి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టబోనని, 2014 ఎన్నికలు తన టార్గెట్‌ అని చెబుతూ వచ్చారు. అంతలోనే లక్ష్యదీక్ష, జలదీక్ష, ఫీజు పోరు, మధ్యలో జరిగిన ఓదార్పు యాత్రల్లో స్వరం మారుస్తూ వస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని తొలుత విమర్శించారు. పేదలను, ప్రజలను, వైఎస్‌ పథకాలను అమలు చేయని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. ఫీజుపోరు దీక్ష ప్రారంభించిన తొలి రోజు జగన్‌ ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితే అపచారం చేసినట్లవుతుంది, గంగా, కృష్ణా, గోదావరి లాంటి పుణ్యనదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయని, ప్రభుత్వాన్ని కలిపితే నదులు అపవిత్రం అవుతాయని 'దాడి'ని తీవ్రతరం చేశారు. అదే సభలో కొంచెం ముందుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం తమకు లేదన్నారు.

Wednesday, February 23, 2011

వినీల్‌కృష్ణ విడుదల

మల్కనగిరి జిల్లా కలెక్టర్‌ వినీల్‌కృష్ణను మంగళవారం రాత్రి మావోయిస్టులు విడుదల చేశారు. ఆయన్ని గత మంగళవారం మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. వినీల్‌కృష్ణను విడుదల చేయాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాలని మావోయిస్టులు కోరారు. అందుకు ఒడిశా ప్రభుత్వం అంగీకరించింది. మధ్యవర్తుల చర్చలు ఫలించాయి. ఎట్టకేలకు మావోయిస్టులు వినీల్‌ను విడుదల చేశారు. ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వినీల్‌ విడుదలతో ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజుల సస్పెన్స్‌కు తెర పడింది. వినీల్‌ను విడిపించడానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా ప్రభుత్వాలు బాగానే స్పందించాయి. అవసరమైన చర్యలు చేపట్టాయి. అలాగే ఇచ్చిన మాట ప్రకారం మావోయిస్టులు వినీల్‌ను, మరో అధికారిని విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, మావోయిస్టులకు, వినీల్‌ కిడ్నాపైన దగ్గర నుండి ఆందోళనలు, సంఘీబావ ర్యాలీలు నిర్వహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు.

సర్కార్‌కు మేలు..ప్రజలకు కీడు

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపకుండా తీర్మానం సభ ఆమోదం పొందడం ఇదే తొలిసారి. టిఆర్‌ఎస్‌, టిడిపి తెలంగాణ ఫోరం ఎమ్మెల్యేలు సభలో గొడవ చేస్తూనే ఉన్నారు. ఈ నెల 18న గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం, దానికి టిడిపి, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఐదుగురు వారం రోజుల పాటు సస్పెన్షన్‌ కావడం జరిగిపోయాయి. శని, ఆదివారాలు అసెంబ్లీకి శెలవు. శుక్ర, సోమ, మంగళవారాల్లో సభ సమావేశమైనా టిఆర్‌ఎస్‌. టిడిపి సభ్యుల లొల్లితో ఎటువంటి చర్చా లేకుండానే వాయిదా పడింది. నిబంధనల ప్రకారం గవర్నర్‌ ప్రసంగానికి అసెంబ్లీ ధన్యవాదాలు తెపాలి. ప్రసంగంలోని అంశాలపై అన్ని పార్టీలూ చర్చించాలి.

Monday, February 21, 2011

జగన్‌ 'ఫీజు పోరు'కు జనం పలచన

వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లో చేపట్టిన 'ఫీజు పోరు' దీక్షకు జనం పలచబడ్డారు. గతంతో పోల్చితే ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌కు నిధులు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఈ నెల 18 నుండి వారం రోజులపాటు ఇందిరాపార్క్‌లో జగన్‌ దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌ శివార్లలో వరలక్ష్మి అనే ఇంజనీరింగ్‌ కాలేజి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో చేపట్టిన దీక్ష కావడంతో వేదికకు 'వరలక్ష్మి ప్రాంగణం' అని పేరుపెట్టారు. వరలక్ష్మి మరణించిన తొలి రెండు మూడు రోజుల్లోనే దీక్ష చేపట్టినట్లయితే ఊపు వచ్చేది. కాని అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాక ఒక రోజు దీక్ష చేయాలనుకున్నారు జగన్‌. ఆయన ఎత్తుగడ తీవ్రంగానే ఉంది. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు దీక్ష చేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చనుకున్నారు. 17 నుండి సమావేశాలు జరుగుతున్నాయని, 23న బడ్జెట్‌ పెడతారని వార్తలొచ్చాక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు 18 నుండి వారంపాటు దీక్ష చేస్తానన్నారు. అంటే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజు వరకూ జగన్‌ దీక్ష కొనసాగుతుందన్నమాట.

Sunday, February 20, 2011

వినిల్‌కృష్ణను విడుదల చేయాలి

ఒడిషా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ వినిల్‌కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్‌ చేయడం బాధాకరం. విజయవాడకు చెందిన వినిల్‌ ఐఎఎస్‌ ఒడిషా కేడర్‌లో పోస్టింగ్‌ రావడంతో ఆయన అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. యువ ఐఎఎస్‌ ఆఫీసర్‌ అయిన వినిల్‌ను మావోయిస్టులు విడుదల చేయాలి. ఆయనకు ఎటువంటి హాని తలపెట్టొద్దు. వినిల్‌తో పాటు కిడ్నాపైన మరో అధికారిని కూడా విడుదల చేయాలి. మావోయిస్టులు పెట్టిన డిమాండ్లలో కొన్ని కేవలం ఒడిషాకే పరిమితమై లేవు. గ్రీన్‌హంట్‌ నిలిపివేత అనేది కేంద్రం పరిధిలో ఉంది. 

Saturday, February 19, 2011

బొత్సపై క్రిమినల్‌ కేసు పెట్టాలి

ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌కు కావల్సినన్ని నిధులు ఇవ్వాల్సింది పోయి హైదరాబాద్‌ శివార్లలో ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్‌ విద్యార్థిని వరలక్ష్మి మరణాన్ని రాజకీయం చేయడం దుర్మార్గం. వరలక్ష్మి చదువుతున్న విజ్ఞాన్‌ కాలేజీ యాజమాన్యం పెట్టిన వత్తిళ్ల వల్లనే ఎస్సీ అయిన వరలక్ష్మి వంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తుతం రవాణాశాఖ బాధ్యతలు చూస్తున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీలో రవాణ శాఖ మంత్రిని ఎందుకు నియమించారో తెలీదు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రో, ఉన్నత విద్యశాఖ మంత్రో, ఆర్థిక మంత్రో, ముఖ్యమంత్రో వరలక్ష్మి హత్యపై స్పందిస్తే ఏదోలే అనుకోవచ్చు. పిలవని పేరంటానికి వచ్చినట్లు రవాణ శాఖ మంత్రి బొత్స వరలక్ష్మిది ఆత్మహత్యకాదు, గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ప్రమాదంలో చనిపోయిందని అవాకులు చవాకులు పేలారు.