Friday, March 11, 2011

అయ్యో మహాత్ములారా?!

ఈ ఘోరం గురించి ఏం రాస్తాం. ఏం మాట్లాడతాం. 'మహాత్ములారా క్షమించండి' అని పశ్చాతాప పడి నివాళులర్పించడం తప్ప... గురువారం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై జరిగిన విధ్వంస చర్యలు అత్యంత బాధాకరం. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు యావత్‌ తెలుగు జాతి తలదించుకునే కిరాతక, ఆటవిక చర్యలకు తెలుగువాళ్లే పాల్పడటం విచారకరం. విశ్వ శాంతిని మానవాళికి ప్రబోధించిన తథాగతుని సాక్షిగా పైశాచిక హింస చోటు చేసుకోవడం దారుణం. తెలుగు వైతాళికుల విగ్రహాలు నేల కూల్చడమంటే అదేదో ప్రాణం లేని విగ్రహాలను పడగొట్టడంగా జమ కట్టడం అనాగరికం. చరిత్రను ధ్వంసం చేయబూనుకోవడం, ఆనవాళ్లను శిథిలం చేయడం, వారసత్వ సంపదను విచ్ఛిన్నం చేయడం ఘోరాతి ఘోరం. తెలుగుజాతికి 2011 ఫిబ్రవరి 10 దుర్దినం, బ్లాక్‌డే. అన్నింటికీ మించి సిగ్గుపడాల్సిన రోజు. తలదించుకోవాల్సిన రోజు.

Thursday, March 10, 2011

ప్రధానికి అంత ఎకసెక్కెమా?

దేశ ప్రధాని బాధ్యతల్లో ఉన్న వ్యక్తికి ప్రజలంటే ఇంత ఎకసెక్కెమేల? అసలు తాను ప్రధాన మంత్రినన్న విషయం గుర్తుందా? తాను పార్లమెంట్‌లో మాట్లాడుతున్నాన్న స్పృహ ఆయనకుందా? బుధవారం రాజ్యసభలో సెంట్రల్‌ విజిలెన్స్‌ చీఫ్‌ కమిషనర్‌ (సివిసి)గా థామస్‌ నియామకంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పందించిన తీరు ప్రజలను, ప్రతిపక్షాలను అవహేళన చేసేవిధంగా ఉంది. చెవిలో పువ్వు పెట్టినట్లు అనుకోవాల్సి ఉంటుంది. సివిసిగా థామస్‌ నియామకంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం, ప్రభుత్వ నిర్వాకంపై ప్రతిపక్షాల నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో ఇప్పుడు తప్పును మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రధాని. రాజ్యసభలో ప్రధాని సమాధానమిస్తూ సివిసి నియామకంలో తన తప్పు ఉందని ఒప్పుకున్నారు. అంత వరకూ బాగానే ఉంది. అంతలోనే సివిసిపై గతంలో కేసు ఉన్న విషయం తనకు తెలీదని తప్పించుకొనే ప్రయత్నం చేశారు.

Wednesday, March 9, 2011

కాంగ్రెస్‌ అవకాశవాదం.. రాష్ట్రంలో అనిశ్చితికి కారణం

తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? ఏ పరిష్కారాన్ని కనుగొంటుంది? నిన్నగాక మొన్న ఎఐసిసి ప్రతినిధి ఒకరు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉంది, అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గరకొచ్చేసరికి ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది అని డబుల్‌ మీనింగ్‌ డైలాగులు చెప్పారు. అంటే కాంగ్రెస్‌ విధానం ఒకటి, కాంగ్రెస్‌ సారధ్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం వేరొకటి అయినట్లు చెప్పుకొచ్చారు. అంటే యుపిఎ భాగస్వామ్య పక్షాలను దోషులుగా చూపి తాను తప్పించుకొనే యత్నానికి కాంగ్రెస్‌ ఒడిగట్టింది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి సైతం తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వ విధానం వేర్వేరుగా ఉన్నాయని పేర్కొన్నారు.

Tuesday, March 8, 2011

నాగం మరో దేవేందర్‌గౌడ్‌ అవుతారా?

టిడిపి శాసనసభాపక్ష ఉపనేత నాగం జనార్ధనరెడ్డి ఇప్పుడు వార్తల్లో వ్యక్తి. ఆయన వ్యవహారశైలి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌. ఇంతకూ నాగం టిడిపిలో ఉంటారా లేక పార్టీని వీడతారా? ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి టిడిపికి రాజీనామా చేశారు. టిఆర్‌ఎస్‌ పంచన చేరారు. త్వరలో ఎమ్మెల్యేగిరీకీ రాజీనామా చేస్తానన్నారు. ఇప్పుడు నాగం వంతు వచ్చింది. వాస్తవానికి నాగం వ్యవహారంతో టిడిపి అధినేత చంద్రబాబు కొంత కాలంగా తలనొప్పులను ఎదుర్కొంటున్నారు. గతంలో ఒకసారి చంద్రబాబు తెలంగాణ నేతల సమావేశం ఏర్పాటు చేసి ఒకరిద్దర్ని వదులుకోవడానికి సిద్ధమంటూ సంకేతాలు పంపారు. అప్పట్లో నాగం, బాబు మధ్య చర్చలతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగిందని అనిపించినా తరచు నాగం ధిక్కారస్వరం వినిపిస్తూ వచ్చారు. మోత్కుపల్లి వంటి నేతలు నాగం వైఖరిని తప్పుబడుతున్నారు.

Friday, March 4, 2011

కెసిఆర్‌కు అద్వాని షాక్‌!

బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కె అద్వాని గురువారం లోక్‌సభలో కెసిఆర్‌కు పెద్ద షాక్‌ ఇచ్చారు. లోక్‌సభలో బైఠాయించి సభకు అంతరాయం కలిగిస్తున్న టిఆర్‌ఎస్‌ ఎంపీలు కెసిఆర్‌, విజయశాంతి వైఖరిపై అద్వాని అసహనం వ్యక్తం చేశారు. ఈ రకంగా సభను అడ్డుకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగే ఉద్యమానికి మద్దతిస్తున్న శక్తుల్లో వ్యతిరేక భావం ఏర్పడుతుందని పరోక్షంగా హెచ్చరించారు. బిజెపి ఫ్లోర్‌లీడర్‌ సుష్మ టిఆర్‌ఎస్‌ ఎంపీలకు మద్దతిస్తూ మాట్లాడగా అద్వాని అందుకు భిన్నంగా స్పందించడంతో కెసిఆర్‌ ఇరకాటంలో పడ్డారనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం బిల్లుకు బిజెపి మద్దతిస్తానంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ముందుకొస్తే రాష్ట్రం ఏర్పడుతుందని కెసిఆర్‌ చెబుతూ వచ్చారు. ఇప్పుడు అద్వాని తమకు వ్యతిరేక భావం రాకుండా నడుచుకోవాలని కెసిఆర్‌కు పరోక్షంగా హెచ్చరిక చేశారు.

Thursday, March 3, 2011

ఈ డ్రామాకు తెర పడేదెప్పుడు?

నిర్ణయం తీసుకోవాల్సిన వారే బహిష్కరించడమేంటి? రాజ్యాన్ని పరిపాలించే రాజే సహాయ నిరాకరణ చేయడంలా లేదూ? కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెడుతున్న కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఎత్తుకున్న అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నినాదాన్ని చూస్తుంటే పై ప్రశ్న, సమాధానం సహజంగా ఎవరికైనా స్పురిస్తాయి. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంపై తీర్మానం చేయాలని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శాసనసభను బహిష్కరించారు. టి-కాంగ్రెస్‌ వాళ్లకు ధీటుగా తాము కూడా సభను బహిష్కరిస్తామంటున్నారు సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. ప్రతిపక్షాలు సభను బారుకాట్‌ చేస్తే ఏదో అనుకోవచ్చు. ప్రభుత్వాన్ని నడుపుతున్నవారే సభను బహిష్కరించడం వింతల్లో వింత. విడ్డూరాల్లో విడ్డూరం. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి? మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ననుసరించి జరుగుతాయి. మంత్రివర్గంలో ఉన్నదెవరు? కాంగ్రెస్‌ శాసనసభ్యుల్లో నుండి మంత్రులైనవారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలకు చెందిన మంత్రులూ కూర్చొని ఫలాన తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరుపుదామని అనుకొని ఆ సమాచారాన్ని గవర్నర్‌కు తెలియజేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే కాంగ్రెస్‌ ప్రభుత్వ సమిష్టి నిర్ణయం మేరకు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలుస్తూనే ఉంది. 
 

Tuesday, March 1, 2011

ఉప్పు, నిప్పు ఒకటయ్యాయా?

ఉప్పు, నిప్పు ఒకటి కావడం విన్నారా కన్నారా? రాజకీయాల్లో మాత్రం ఇది నిజం అవుతుంది. అంతేకాదు ఎవరు ఎప్పుడు ఉప్పు, నిప్పుగా మారతారో కూడా అర్థం కాకుండా ఉంది. తెలంగాణాలో ఉప ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ వరంగల్‌ జిల్లాలో ఓదార్పు యాత్రకు మహబూబాబాద్‌ బయలు దేరిన రోజు చోటు చేసుకున్న ఘటనలను ఇంకా జనం మర్చిపోలేదు. వారి కళ్లెదుట కదలాడుతూనే ఉన్నాయి. అప్పుడు జగన్‌ కాంగ్రెస్‌లోనే ఎంపీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అడ్డం నిలువు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని టిఆర్‌ఎస్‌ గతంలో విమర్శలు చేసింది. వారికి కాంగ్రెస్‌లోని తెలంగాణ సీనియర్‌ లీడర్లు కొందరు వంత పాడారు.