Sunday, February 6, 2011

పులి నోట్లో తల..బెస్ట్ ఆఫ్ లక్ చిరు

టాలీవుడ్‌లో పాతిక ముప్పై ఏళ్లపాటు ఎదురు లేకుండా మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి రాజకీయాల్లో ఎక్‌స్ట్రా ప్లేయరని పేరు తెచ్చుకున్నారు. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ, అవినీతిపై పోరాటం... ఇవి చిరంజీవి ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజారాజ్యం నినాదాలు. టిడిపికి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమని ముందుకొచ్చింది పిఆర్‌పి. కాంగ్రెస్‌ అవినీతిపై ఎన్నికల ముందు నిప్పులు చెరిగిన చిరు అంతలోనే ఆ పార్టీకి దగ్గర కావడం రాజకీయ వ్యభిచారమే అవుతుందంటున్నారు పలువురు సీనియర్‌ నేతలు. సామాజిక న్యాయం, అవినీతిపై పోరాటం అని గొంతు చించుకోవడం వల్లనే ఎన్నికల్లో ఆ మాత్రం ఓట్లు, సీట్లు పిఆర్‌పికి వచ్చాయి. ఇప్పుడు ఆ నినాదాలను పక్కనబెట్టి కేవలం పదవుల కోసమే కాంగ్రెస్‌ పంచన చేరుతున్నారు మెగాస్టార్‌. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన చిరంజీవి స్వయంగా తానే పాలకొల్లులో ఓటమిని చవిచూసి భంగపడ్డారు.

Saturday, February 5, 2011

తెలంగాణాలో మరో కొత్తపార్టీ?

తెలంగాణాలో మరో కొత్త పార్టీ రూపు దిద్దుకోబోతోందా? టిడిపి, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లోని అసంతృప్తి నేతలు కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారా?...కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటస్వామి (కాకా) నేరుగా సోనియాగాంధీపై ఆరోపణలు చేయడం, టిడిపి అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేత నాగం జనార్ధనరెడ్డి ధిక్కారస్వరం వినిపించడం, టిఆర్‌ఎస్‌లో కెసిఆర్‌ వైఖరి నచ్చని నేతలతో ఆయన మేనల్లుడు హరీష్‌రావు మంతనాలు జరపడం... ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి. ఇవన్నీ వేర్వేరుగా ఆయా పార్టీల్లో జరిగిన సంఘటనలైనప్పటికీ వీటికి ఒకే రకమైన పోలిక ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ సంఘటనల నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు ధిక్కారస్వరం వినిపించిన నేతలతో చర్చలు జరిపి అంతా బాగుందని, మనస్పర్ధలు సద్దుమణిగాయని పైకి కలర్‌ ఇచ్చారు. 

Friday, February 4, 2011

కిరణ్‌ సర్కార్‌కు జగన్‌ గుబులు

రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి జగన్‌ ఫోబియా పట్టి పీడిస్తోంది. పైకి జగన్‌కు భయపడేది లేదని, అతనో బచ్చా అని తీసి పారేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు ఎందుకనో ఉలిక్కి పడుతున్నారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకానికి ప్రభుత్వం నిధులివ్వట్లేదని, త్వరలో ఆ సమస్యపై ధర్నా చేస్తానని జగన్‌ ప్రకటించారు. ఆ వెంటనే ప్రభుత్వంలో, రాజకీయంగా ఒక్కసారిగా కదలికొచ్చింది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆ సమస్యపై మేల్కొని ప్రభుత్వానికి డిమాండ్లు చేయనారంభించాయి. అంతలోనే హైదరాబాద్‌ శివారుల్లో ఒక విద్యార్థిని ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందక, కాలేజీ యాజమాన్యం వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త మీడియాలో వచ్చింది. జగన్‌కు చెందిన పత్రికలో కాస్త ప్రముఖంగా ప్రచురితమైంది. విద్యార్థిని ఆత్మహత్యలపై స్పందించిన జగన్‌ తాను 18న హైదరాబాద్‌లో ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ధర్నా చేస్తానని తేదీ సమయం సైతం ప్రకటించారు. అంతే.. ప్రభుత్వంలో వణుకు మొదలైంది.

Thursday, February 3, 2011

రాజా అరెస్టు సరిపోదు

దాదాపు 1.76 లక్షల కోట్ల రూపాయలకు పైబడిన 2జి స్పెక్ట్రం స్కామ్‌ నుండి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎలాగొలా గండం గట్టెందుకు పావులు కదుపుతోంది. కుంభకోణం సమయంలో టెలికం మంత్రిగా ఉన్న డిఎంకె నేత ఎ. రాజాను పదవి నుండి తప్పించినా ప్రతిపక్షాలు ఊరుకోలేదు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేసి సమగ్రంగా విచారించాలని అవి పట్టుబట్టాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో జెపిసి ఏర్పాటుకు ప్రభుత్వం నిరాకరించింది. ప్రతిపక్షాలు జెపిసి కోసం పట్టుబట్టడంతో సమావేశాలు జరగలేదు. ఒక సెషన్‌ మొత్తం ఈ విధంగా అంతరాయాలతో ముగియడం పార్లమెంట్‌ చరిత్రలో రికార్డు. ఈ నెలలోనే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. జెపిసిపై ప్రతిపక్షాలు మరింతగా పట్టుబట్టడం ఖాయం. ఈ గండం నుండి ప్రభుత్వం గట్టే క్రమంలో మాజీ మంత్రి రాజా అరెస్టు బుధవారం జరిగింది.

కాక(కా).. అంతలోనే కూల్‌!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి. వెంకటస్వామి (కాకా) ఎందుకు అంతగా రెచ్చిపోయారు? అంతలోనే ఎందుకు చల్లబడ్డారు?.. వైఎస్‌పై, జగన్‌పై ఒంటికాలిపై లేచే కాకా ప్రతి సమయంలోనూ పార్టీ హైకమాండ్‌కు విధేయుడిగా మెలిగారు. రాష్ట్రపతి పదవిని ఆశించి భంగపడ్డాక కూడా తనకు పదవి రాకపోవడానికి వైఎస్సే కారణమన్నారు తప్ప అధిష్టానంపై ఒక్క మాట మాట్లాడలేదు. బుధవారం కాకా ఏకంగా సోనియాగాంధీపై విమర్శలు సంధించి సంచలనం సృష్టించారు. తక్షణం పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆమె వల్లనే పార్టీ ప్రతిష్ట దిగజారిపోతోందని నిప్పులు చెరిగారు. అంతేకాదు అవినీతి పెరిగిందన్నారు. కెవిపి ద్వారా వైఎస్‌ ఎఐసిసి సభ్యులకు డబ్బు సంచులు పంపారని ఆరోపించారు. ఈ విమర్శలు కేవలం చిరంజీవి కాంగ్రెస్‌తో కలవడం ఇష్టలేకనే చేసినవి కావనిపిస్తోంది.

Wednesday, February 2, 2011

కాంగ్రెస్‌లో 'చిరు' తుఫాన్‌

కాంగ్రెస్‌ తన తలపై తానే నిప్పులు పోసుకుంటోందా? జగన్‌కు చెక్‌ పెట్టేందుకు అది చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీతో పొత్తు లేదా విలీనం ఏదైనా సరే ఈ ప్రతిపాదన ముందుకొచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్‌లో దుమారం లేస్తూనే ఉంది. తాజాగా సోమవారం చిరంజీవిని కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ కలవడం, సోనియాను కలవాలని ఆహ్వానించడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది. చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడల్లా పార్టీలో సుడులు తిరుగుతూ పెనుతుపాన్‌ బీభత్సం సృష్టించడం పరిపాటైంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, టిడిపికి తాను ప్రత్యామ్నాయమంటూ ప్రజల ముందుకొచ్చారు మెగాస్టార్‌. తీరా ఎన్నికల ఫలితాలొచ్చేసరికి చతికిలపడ్డారు. కేవలం 18 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిరంజీవి సిఎం అవుతారన్న ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లడంతో పిఆర్‌పిని నడపడం చిరుకు పను సవాలైంది.

Tuesday, February 1, 2011

నమ్మమంటారా సిఎం సారూ...!

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ మధ్య నమ్మలేని నిజాలు మాట్లాడుతున్నారు. వాటిని ఎలా నమ్మాలో మాత్రం చెప్పట్లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి మాజీ ప్రధాని పివి నర్సింహారావు నుండి అప్పాయింట్‌మెంట్‌ తానే ఇప్పించానన్నారు కిరణ్‌కుమార్‌. అంతేకాదు వైఎస్‌కు పావలావడ్డీ ఐడియా ఇచ్చింది కూడా తానేనని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్‌ ఇస్తామని 1999 ఎన్నికల్లో వైఎస్‌ హామీ ఇచ్చినా ఓట్లు రాల్లేదని విశ్లేషించారు. వైఎస్‌ ఒక్కరి వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదని, తనలాంటి వారందరూ ఒక్కో ఇటుక పేర్చడం వల్లనే రెండుసార్లూ అధికారం దక్కిందని వెల్లడించారు. జగన్‌ విషయం అసలు తమకు పెద్ద విషయమే కాదని కొట్టి పారేశారు. జగన్‌ పక్కన ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ఢంకా భజాయిస్తున్నారు. దమ్ముంటే రాజీనామా చేయాలని ఆ ఎమ్మెల్యేలకు సవాల్‌ కూడా చేశారు. పరిటాల రవి హత్య కేసులో జగన్‌ను రక్షించడానికి తాను అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చారు. ఇన్ని నమ్మలేని నిజాలు చెబుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి తాను జూబ్లీహిల్స్‌లో ఆక్రమంగా ఆక్రమించిన స్థలం గురించి మాత్రం నీళ్లు నములుతున్నారు. సక్రమంగానే భూమిని స్వాధీనం చేసుకున్నానని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున మీడియాతో వాదించారు. ఈ నమ్మలేని నిజాలను ప్రజలు నమ్ముతారంటారా?