ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్ర ఆందోళనల నేపథ్యంలో కేంద్రం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తుది రాష్ట్ర పర్యటన నేడు. హైదరాబాద్‌లో రోజంతా కమిటీ బిజీ బిజీ. గవర్నర్, సిఎం, అధికారులు, రాజకీయపార్టీలు, మీడియాతో వరుస భేటీలు. సాయంత్రానికే ఢిల్లీ పయనం. నేటి శ్రీకృష్ణ పర్యటన లాంఛనం. ఇంతవరకూ తమ అధ్యయనానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి పరిమితం. డిసెంబర్ 31న నివేదిక ఇస్తామని కమిటీ ఎప్పుడో ప్రకటించింది. డిసెంబర్ 31 తర్వాత ఏం జరుగుతుంది అని గవర్నర్‌ను ప్రశ్నిస్తే జనవరి 1 వస్తుంది అని తాపీగా జవాబైతే చెప్పారు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొంటామని డిజిపి అరవిందరావు అంటుంటే, కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పైకైతే చెప్పారుకాని లోపల్లోపల మాత్రం సిఎం, ప్రభుత్వం ఆందోళనగానే ఉంది.
Thursday, December 16, 2010
Wednesday, December 15, 2010
ఇప్పటి దాకా ఎంపీలు చేసింది మౌనదీక్ష కాదా?!
విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాల చివరి రోజున మౌనదీక్ష చేపట్టారంటూ మీడియాలో అమితంగా ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దాదాపు ఆరున్నరేళ్లుగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఇంతకాలం చేసింది మౌనవ్రతమేకదా? కేంద్ర మంత్రులుగా ఉన్న ఎంపీలు సైతం అదే చేశారు. పొరుగు రాష్ట్రాలు ఇబ్బడిముబ్బడిగా నిధులు, రైల్వేలైన్లు, ఇతరత్రా పథకాలను, ప్యాకేజీలను తన్నుకుపోతుంటే మన ఎంపీలు, కేంద్ర మంత్రులు చోద్యం చూస్తున్నారు. మరీ సంవత్సరకాలంగా అయితే రాష్ట్రంలోనే సీమాంధ్ర, తెలంగాణా అంటూ విడిపోయి పైకి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. లోపల తమ స్వప్రయోజనాలు, లబ్ది చూసుకుంటున్నారు. ఎక్కడ తమ ప్రాంతంలో ఓట్లు పోతాయోనని తప్ప ఎంపీలు చేస్తున్న ప్రాంతీయ 'ఉద్యమాల్లో' ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడుతున్నట్లు పైకి ఫోజు పెడుతున్నారు. కాంగ్రెస్ వేదికలమీద తామంతా ఒకటేనని, సోనియా నాయకత్వమని బృందగానం ఆలపిస్తున్నారు. వీళ్లని ఎవరు నమ్ముతారు?
Monday, December 13, 2010
కిరణ్‌కు మెచ్యురిటీ కొరత!
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు నాలుగు తడవలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాజకీయంగా మెచ్యురిటీ కాలేదనిపిస్తోంది. ఎమ్మెల్యేగా, చీఫ్‌విప్‌గా, స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించినా సరిగ్గా రాజకీయాలు వంటబట్టించుకోలేదు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న నేత ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడుతున్నారు. సీనియర్ రాజకీయవేత్త నల్లారి అమర్‌నాథ్‌రెడ్డి వారసుడైనప్పటికీ ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్ నేతలకే అంతుబట్టకుండా ఉంది. వైఎస్ ఉన్నంత కాలం తండ్రిచాటు బిడ్డలా పదవుల్లో ఒదిగిపోయిన కిరణ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఊహించని రీతితో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే అసెంబ్లీలో, బయట మీడియా ముందు ఆయన స్పందిస్తున్న తీరులో మెచ్యురిటీ లోపిస్తోంది. స్పీకర్‌గా సంవత్సరంన్నర పని చేసి అందరి చేత అధ్యక్షా అని పిలిపించుకున్న కిరణ్, తాను సిఎం స్థానం నుండి మాట్లాడాల్సి వచ్చే సరికి ఆ మాట మర్చిపోయారు. నేరుగా టిఆర్‌ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలనుద్దేశించి మాట్లాడారు.
Sunday, December 12, 2010
సురేఖ లేఖ వెనుక ఎవరున్నారు?
వైఎస్ తన ఆత్మగా చెప్పుకున్న కెవిపి రామచంద్రరావును బ్రోకర్ అంటూ ఎమ్మెల్యే కొండ సురేఖ ఎందుకు లేఖ రాసినట్లు? అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే లేఖాస్త్రం సంధించడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ సందేహాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్‌లో చర్చనీయాంశమయ్యాయి. సురేఖ లేఖపై ఇంతగా చర్చ జరగడానికి ఆరున్నరేళ్ల గత చరిత్రే కారణం. అదృశ్యశక్తి, భేతాళమాంత్రికుడు, ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు సూత్రధారి, జల (ధన)యజ్ఞానాకి రథసారధి, కలెక్షన్ కింగ్..ఇలా రాసుకుంటూ పోతే ప్రతిపక్షాలు, పత్రికలు కెవిపికి ఇచ్చిన బిరుదులు చాలానే ఉన్నాయి. ఎప్పుడూ వైఎస్ వెన్నంటి ఉండే ఆయన 'ఆత్మ'పై కాంగ్రెస్ నేతల నుండి సైతం విమర్శలొచ్చాయి. మంత్రివర్గం ఎంపిక నుండి ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులకు టిక్కెట్లిచ్చే వరకూ, కార్పొరేషన్ పదవుల పందేరం దగ్గర నుండి పార్టీలో గల్లీ పదవుల వరకూ కెవిపి చక్రం తిప్పారంటారు కాంగ్రెస్ నేతలు. స్నేహమంటే ఇదేరా అన్న స్టయిల్‌లో వైఎస్, కెవిపి మైత్రిని ఫ్రెండ్‌షిప్‌డే రోజు పలు పత్రికలు ఫొటోలు వేసి మరీ ఆకాశానికెత్తాయి.
Friday, December 10, 2010
వివేకాకు ఆదిలోనే అవమానం?
వైఎస్ వివేకానందరెడ్డిని అప్పుడే కాంగ్రెస్ అవమానించిందా? సచివాలయంలో ఆయన కోరుకున్న ఛాంబర్ ఎందుకు కేటాయించలేదు? ఛాంబరే ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో వైఎస్‌ఆర్ లేని కాంగ్రెస్‌లో వివేకానందను తక్కువగా చూస్తారా? ఈ ప్రశ్నలు వైఎస్ అభిమానులను, కాంగ్రెస్ నేతలను, చివరికి సాధారణ పరిపాలనాశాఖను సైతం వేధిస్తున్నాయి. వైఎస్ జగన్‌కు చెక్ పెట్టేందుకు ఆయన కుటుంబాన్నే చీల్చింది కాంగ్రెస్. వైఎస్, వివేకానంద కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఉన్న విభేదాలను పార్టీ సొమ్ము చేసుకుందనే చెప్పాలి. ఒత్తి పెడితే ఏదోక రోజు ఎదురు కొడుతుంది, పిల్లిని గదిలోపెట్టి కొడితే దాడి చేస్తుంది అనే సామెతలు ఉండనే ఉన్నాయి. అలాగే దశాబ్దాలుగా అణిగిమణిగి ఉన్న వివేకా ఒక్కసారిగా జూలు విదిలించి జగన్‌కు వ్యతిరేకంగా మారి ఉంటారు. వైఎస్ కుటుంబ గొడవలెలా ఉన్నా జగన్ మాత్రం తనను దెబ్బకొట్టడానికి తమ కుటుంబంలో సోనియాగాంధీ చిచ్చు పెట్టారని మదనపడి కాంగ్రెస్‌ను వీడినట్లు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
Saturday, December 4, 2010
డిప్యూటిపై నాన్చుడెందుకు?
కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రశ్న రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు జరిగింది. కిరణ్‌కుమార్‌రెడ్డి అనుకోకుండా సిఎం అయ్యారు. సీమాంధ్రకు చెందిన కిరణ్ సిఎం కనుక తెలంగాణాకు డిప్యూటి సిఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ మీడియా ముఖంగా ప్రకటించారు. కేబినెట్ కూర్పుపై కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి సైతం 'డిప్యూటి' తెలంగాణాకు ఇస్తామని స్పష్టం చేశారు. దామోదర్ రాజనర్సింహ 'డిప్యూటి' అని మీడియాకు లీకులొదిలారు. మంత్రుల ప్రమాణస్వీకారం సమయంలో 'డిప్యూటి' మాట ఎత్తలేదు. అదేంటంటే రాజ్యాంగంలో డిప్యూటి అనే పదం ఎక్కడా లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. డిప్యూటి సిఎం ప్రత్యేకంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన అవసరం లేదన్నారు.
Friday, December 3, 2010
జగన్ సక్సెస్ అవుతారా?
ఆన్సర్ మై క్వచ్చన్.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ తనయుడు జగన్ కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా కనబడుతోంది. పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల్లోపు పార్టీ పెడతారని, త్వరలో ప్రకటన ఉంటుందని జగన్ మౌత్‌పీస్ అంబటి రాంబాబు పేర్కొన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడిన మరుక్షణం నుండి ఆయన పెట్టబోయే పార్టీపై ఊహాగానాలోస్తున్నాయి. 'వైఎస్‌ఆర్ కాంగ్రెస్' పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తి ఆ పేరును జగన్‌కు అంకితమిస్తానంటున్నారు. జగన్ కొత్త పార్టీ పేరేంటి, అది ఎలా ఉండబోతోందన్న విషయాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పేరు దాదాపు ఖరారైందంటున్నారు. 'వైఎస్‌ఆర్ కాంగ్రెస్'లో వైఎస్‌ఆర్ అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి అనుకోవచ్చు లేదా 'యువజన శ్రామిక రైతు' అయినా అనుకోవచ్చు. రెండు అర్థాలొచ్చేటట్లు పేరు పెట్టారంటున్నారు.
Subscribe to:
Posts (Atom)






